గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇటీవలె చర్లపల్లి సెంట్రల్ జైలులో ఎంపీ సంతోష్ కుమార్ ఖైదీలతో కలిసి మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఖైదీల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సాయం చేస్తానని తెలిపారు.
అనంతరం ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు సంతోష్ కుమార్. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం… ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని కోరారు. ప్రగతి భవన్ లో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాజీవ్ త్రివేది, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు సంతోష్ కుమార్.