శరీరంలో అనేక చర్యలు సాఫీగా జరగాలంటే విటమిన్ సి తప్పనిసరని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం ప్రగతి భవన్‌లో తెలంగాణ బత్తాయి డే బ్రోచర్‌ను ఎంపి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. మే 10న నిర్వహించే “తెలంగాణ బత్తాయి డే”ని పురస్కరించుకొని ప్రజలు పెద్ద ఎత్తున బత్తాయి పండ్లను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బత్తాయి పండ్లను తినటం వల్ల కలిగే లాభాలను విడమర్చి చెప్పారు. మిటమిన్ సి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమంతప్పకుండా తీసుకోవటం వల్ల రోజువారి దినచర్య సాఫీగా సాగుతుందని అన్నారు.
కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. బత్తాయి పండ్లలో యాంటి యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. స్కర్వీ వ్యాధి నివారణకు, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సి విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తయని ఆయన అన్నారు.
బత్తాయి పండ్లను బాగా తినటం వల్ల శరీరం పోషకాలను బాగా గ్రహించి రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందని అన్నారు. బత్తాయి పండ్లను కొనుగోలు చేసి వాటిని సాగుచేసే రైతులను ఆదుకోవాలన్న సీఎం కెసిఆర్ మాటలను సంతోష్ కుమార్ గుర్తు చేశారు.మే 10న ఒకే రోజు 2020కు సరఫరా చేసేందుకు ఏర్పాట్లను చేసిందని వాక్ ఫర్ వాటర్ వెల్లడించింది.