రాష్ట్ర ప్రభుత్వ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఎంపి సంతోష్ కుమార్ స్పందించారు. తనలో దాగి ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ఆకలితో పస్తులుపడుకోకుండా వారి కడుపు నింపేందుకు చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ ముగిసి వారికి తిరిగి ఉపాధి దొరికే వరకు ప్రతి రోజు వెయ్యిమందికి అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చారు.
కరీంనగర్ పట్టణంలోని హౌజింగ్ బోర్డులో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ లాల్ ప్రారంభించి వలసకూలీలకు వడ్డించారు. అయితే కరోనా ప్రబలుతున్న నేపధ్యంలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు నిర్వాహకులు. వలస కూలీలు ఆకలితో అలమటించకుండా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ వలస కూలీల ఆకలితీర్చేందుకు ముందుకు వచ్చిన ఎంపి సంతోష్ కుమార్‌కు హృదయ పూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామన్నారు.
అదనపు కలెక్టర్ శ్యామ్ లాల్ ఈ రోజు 3 వందల మందికి భోజనాన్ని అందించామని దశల వారిగా వెయ్యి మందికి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఉపాధి కోల్పోయి పస్తులు పడుకునే తమకు భోజనం అందించేందుకు ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఎంపి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలను తెలియజేస్తున్నామన్నారు ఒరిస్సా వలస కూలీలు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ లాల్, కరీంనగర్ తహసీల్దార్,కరీంనగర్ కార్పోరేటర్, స్థానికురాలు, కరీంనగర్ వలసకూలీలు పాల్గొన్నారు.