తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జనగామ, యాదాద్రి పర్యటనల్లో సీఎం కేసీఆర్‌తో క్లోజ్‌గా మూవ్ అవడం హస్తం పార్టీని కుదిపేసింది. కోమటిరెడ్డి త్వరలో టీఆర్ఎస్‌లో చేరుతారని వార్తలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి క్లాస్ తీసుకుంది. దీంతో హడావుడిగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి..అన్నా ఇక నుంచి మన మధ్య లొల్లి వద్దు..కలిసి పని చేద్దామని చేయి చేయి కలిపాడు. ఇంటి బయటకు వచ్చి మీడియా కెమెరాల ముందు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇద్దరం కలిసి కేసీఆర్‌తో పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే ఆ మరునాడే కోమటిరెడ్డి షరా మామూలుగా రేవంత్‌రెడ్డికి ట్విస్ట్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డితో విబేధాల నేపథ్యంలో గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్న మీరు…ఇప్పుడు కలిసి పని చేస్తామని చెబుతున్నారు..దీనికి కారణమేంటని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అంటే పీసీసీ చీఫ్ ఒక్కడే కాదని, పరోక్షంగా రేవంత్‌కు చురకలు అంటించారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ..ఇక్కడేం జరుగుతుందో హైకమాండ్‌కు చేరవేసేందుకు మీడియేటర్లు ఉంటారని, కాంగ్రెస్‌లో వ్యక్తిగత నిర్ణయాలకు తావు లేదని పీసీసీ చీఫ్‌కు పంచ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 70-80 సీట్లకు టార్గెట్ పెట్టుకుంటే 60 సీట్లు ..90 సీట్లకు టార్గెట్ పెట్టుకుంటే 65-70 సీట్లు గెలుస్తామని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పుడు 40-45 సీట్లలో గెలుస్తామని ప్రజల సర్వేలో తేలిందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మాకు పీకే సర్వే, ఇండియా చాణక్య సర్వేలు అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి కుండబద్ధలు కొట్టారు. అయితే ఈసారి 5 నెలలకు ముందు టికెట్లు ప్రకటించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. పొత్తులు, గిత్తులు అని చెప్పా లాస్ట్ మూమెంట‌్‌లో పోయినసారి లాగా తప్పు పని చేయద్దని పీసీసీ చీఫ్‌కు సూచించారు.
గతంలో చంద్రబాబుతో, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని చాలా నష్టపోయాం..అప్పుడు కూడా నేను ఒక్కడానే పొత్తు వద్దని గట్టిగా కొట్లాడిన సంగతిని గుర్తు చేశారు. ఈసారి గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. కాని ఎవరికిపడితే వారికి టికెట్లు ఇస్తే మాత్రం హైకమాండ్ దగ్గర సీరియస్‌గా ఫైట్ చేస్తానని రేవంత్‌ను హెచ్చరించారు. గతంలో సచిన్ పైలెట్ రాజస్థాన్ పీసీసీ చీఫ్ అయినప్పుడు బస్సులు, కార్లు, బైకులతో ప్రతి గ్రామాన్ని టచ్ చేసారు…ఆ విధంగా ప్రతి గ్రామానికి వెళతానని, బస్సు యాత్ర లేదా పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో మాట్లాడిన తర్వాతనే..పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పని చేస్తానని కోమటిరెడ్డి కుండబద్ధలు కొట్టారు. . మొత్తంగా ఉప్పూ, నిప్పులా ఉన్న నాయకులు కలిసిపోయారని క్యాడర్ సంబురపడుతున్న వేళ….కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి పార్టీ అంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కడే కాదంటూ అతి పెద్ద ట్విస్ట్ ఇవ్వడం కాంగ్రెస్ వర్గాలకు షాకింగ్‌గా మారింది.