కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడిన కేశవరావు…సాగు అనేది రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమని తెలిపారు.
అయితే ఈ చట్టాలను మొత్తానికే రద్దు చేయాలని రైతులు తీసుకున్న దృఢ వైఖరిని తాను అంగీకరించడం లేదన్నారు. రైతుల ఉద్యమం గురించి నేను మాట్లాడుతున్నాను… మనం మరికొంత ప్రజాస్వామికంగా, ఇంకాస్త సర్దుబాటు, ఔదార్యంతో వ్యవహరించే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
అనేక అంశాలకు ఇంకా పరిష్కారం దొరకలేదని రైతు నాయకులు చెబుతున్నారు. అపరిష్కృత అంశాలేమిటో మనకు తెలియడం లేదు. అందువల్ల వీటిని పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ బిల్లులు గందరగోళం మధ్య ఆమోదం పొందాయి….. సభ్యుల ఆందోళనల నడుమ సవరణలు ప్రతిపాదించే అవకాశం కూడా లేకుండాపోయిందన్నారు. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ ప్రభుత్వం మద్దతు ధరకు (ఎమ్మెస్పీకి) సిద్ధంగా ఉన్నామని చెబితే.. దానిని చట్టంలో పెట్టడంలో ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు.