అమరావతిలో జరిగిన మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ…మహిళ సాధికారతకు బాటలు వేసేందుకు కృషిచేయాలని…జీవితాన్ని చదివిన మహిళలు గ్రామాల్లో ఉన్నారని ఆమె అన్నారు. ఆధునిక స్త్రీ చరిత్రను పునర్నిర్మిస్తుందని గురజాడ చెప్పినట్లు కవిత గుర్తు చేశారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ మహిళలకు ఓటు హక్కు వినియోగించుకోని పరిస్థితి ఉందని కవిత అన్నారు.
పశ్చిమ దేశాల్లోనూ మహిళలపై కనిపించని అద్దంలా ఆంక్షలు ఉన్నాయన్నారు. దేశం కోసం త్యాగాలు చేసి, నాయకత్వం వహించిన మహిళలు భారత్ సొంతమన్నారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 200 ఏళ్లు దాటినా, ఆ దేశానికి ఇంతవరకు ఓ మహిళ దేశాధ్యక్షురాలు కాలేకపోయిందన్నారు. కానీ 1960 దశకంలోనే భారతదేశం మహిళా నాయకత్వాన్ని అంగీకరించిందన్నారు. మద్యపాన నిషేధం కోసం ఉద్యమించిన రోశమ్మ స్ఫూర్తితో మహిళలు నాయకత్వ పటిమను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా అమరావతి వైభవంతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు కవిత చెప్పారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. దేశంలోని మహిళల్లో చైతన్యం ఎంతో ఉందని కవిత తెలిపారు. ఏ విషయంలోనైనా ప్రశ్నించే స్వభావాన్ని మహిళలు అలవర్చుకోవాలని కవిత సూచించారు. మహిళా స్వేచ్చ అనేది మన రక్తంలోనే ఉందన్నారు. ఇంటర్న్ షిప్ అనేది ఇతర దేశాల్లో విస్తృతంగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలు కొందరు తన దగ్గరకు ఇంటర్న్ షిప్ కోసం వచ్చారని కవిత పేర్కొన్నారు. కానీ ఇంటర్న్ షిప్‌కు తెలుగు అమ్మాయిలెవరూ దరఖాస్తు చేయడం లేదన్నారు.భారతీయ సంస్కృతిలో ఉన్న మంచి అంశాలను తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు. చివరగా మాట్లాడిన జైతెలంగాణ…జై ఆంధ్రా అంటూ తన ప్రసగం ముగించింది.
అంతక ముందు ఎంపీ కవిత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని… అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గగుడి ఈవో సూర్య కుమారి ఎంపీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రాంతాలుగా వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని ఎంపీ కవిత పునరుద్ఘాటించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.