నిష్పక్షపాతంగా నిజాల్ని రాసే పత్రికలు నేడు చాలా అరుదు… తెహల్కా తరహాలో ధైర్యంగా వార్తలు రాసే పత్రికలు కనబడటం లేదని అన్నారు తెలంగాణ జనజాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ, ఏపీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 13 ఎడిషన్లతో వస్తున్న `మనం` పత్రికను ప్రారంభించిన సందర్భంగా హైదరాబాద్ లో మాట్లాడిన కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కో పత్రిక ఒక్కో రకం వార్తల్ని ఉద్యమంపై రాశాయన్నారు. జాతీయ పత్రికలు ఉత్తరాది వార్తలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాయి. తెహల్కా లాంటి నిర్భయంగా వార్తలు రాసే పత్రికలు నేడు లేవు. నిష్పక్షపాతంగా, నాణ్యతతో కూడిన వార్తల్ని `మనం` పత్రిక అందించాలి. బలం లేని బలహీనుల గొంతుక మనం కావాలి. మహిళల గొంతుకను మనం వినిపించాలి. సంక్షేమపథకాల్ని ప్రజలకు విశదపరచాలి. నిష్పక్షపాతంగా, నిజాల్ని నిర్భయంగా రాసే పత్రికలకు మా ప్రభుత్వ సపోర్టు ఎల్లపుడూ ఉంటుంది. తెలంగాణలో మరిన్ని పత్రికలు రావాల్సిన అవసరం ఉంది“ అని అన్నారు.
`మనం` పత్రిక అధినేత, ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్త గాలి అనీల్‌కుమార్ మాట్లాడుతూ -“లాభాపేక్షతో ఈ పత్రికను పెట్టలేదు. జనం కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రారంభించిన పత్రిక ఇది. నిష్పక్షపాతంగా ప్రజల కోణంలో వార్తల్ని ప్రచురిస్తాం“ అన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ -మనం సర్వతో ముఖాభివృద్ధిని సాధించాలి. అందుకు అందరం కలిసి కృషి చేయాలి“ అన్నారు.
ఈరోజుల్లో ధైర్యం చేసి ఇలా పత్రికను ప్రారంభించిన అనీల్‌ని అభినందిస్తున్నానని మంత్రి పద్మారావు అన్నారు. జర్నలిస్టుల కష్టాలు తెలుసు, వారికి అక్రిడిటేషన్ కష్టాలు తొలగించేందుకు, జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి ఎంపీ కవితతో మాట్లాడతామని `మనం` బోర్డ్ డైరెక్టర్లలో ఒకరైన రమేష్ అన్నారు. మనం ప్రజల కోసం చేసే ఓ యజ్ఞంలాంటిదని మరో డైరెక్టర్ యూసఫ్ అలీ అన్నారు. వార్తల్ని నిర్భయంగా రాస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాల్ని చేరవేసేందుకు మనం కృషి చేస్తుందని `మనం` మరో డైరెక్టర్ మూర్తి అన్నారు. 9నెలల క్రితం ఓ చెట్టుకింద కూచున్న ఆలోచన పురుడుపోసుకుని `మనం` అయ్యిందని మరో డైరెక్టర్ యాదగిరి రాజు అన్నారు. మనం అందరినీ అలరించే పత్రిక అవుతుందని మరో డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సంస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని మరో డైరెక్టర్ గాలి గిరి ఆకాంక్షించారు.
మనం ఎడిటర్ సత్యమూర్తి మాట్లాడుతూ -“ఇంతకాలం ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టినవారిని చూశాం. ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్లి ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తను చూస్తున్నాం. మనం ఛైర్మన్, పారిశ్రామికవేత్త రూల్‌ని బ్రేక్ చేయడం అభినందనీయం“ అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు `మనం` పత్రిక క్యాలెండర్‌ను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మనం బోర్డ్ డైరెక్టర్లు … రమేష్, యూసఫ్ అలీ, మూర్తి, యాదగిరి రాజు, శ్రీనివాస్, గాలి గిరి, టీఆర్ ఎస్ నేతలు.. దేవేందర్‌రెడ్డి, రౌతు కనకయ్య, రంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు చంద్రయ్య, కార్పొరేటర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
https://youtu.be/zqhUDT-aalU