మున్నురుకాపులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటే మేలు జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 16 మున్నూరు కాపు సంఘాలతో సమావేశమైన కవిత ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి,సంక్షేమం కోసం కృషిచేస్తుందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కుల సంఘాల బాధ్యులపై ఉందన్నారు. మున్నూరు కాపు కులస్తుల్లోనూ ప్రభుత్వ పథకాల పట్ల పూర్తి స్థాయి అవగాహన లేదని, కుల పెద్దలుగా అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు.
మున్నూరు కాపుల సమస్యలు అడిగి తెలుసుకున్న కవిత…కళ్యాణ మండపం కోసం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మాణం చేపడతామన్నారు. పర్యావరణ పరిరక్షణకు అన్ని వర్గాలు పాటు పడేలా కుల పెద్దలు బాధ్యత తీసుకోవాలని అన్నారు.
నిజామాబాద్ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తామని..డిసెంబర్ నాటికి నిజామాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు కవిత. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికీ తాగు నీరు, విశాలమైన రోడ్లు, లైటింగ్, కూడళ్ల అభివృద్ది, బైపాస్ రోడ్డు వంటి సౌకర్యాలతో త్వరలోనే నిజామాబాద్ నగరం సుందరంగా కనిపించనుందని వివరించారు.