‘దళిత్’ రాయొద్దు.. వాడొద్దు

203
bombay high court

ఇకపై మీడియాలో దళిత్ అనే పదాన్ని వాడకూండా చూడాలని కేంద్ర సమాచార,ప్రసారాల మంత్రిత్వ శాఖకు సూచించింది ముంబై హైకోర్టు. అన్ని ప్రభుత్వ పత్రాలు,ఉత్తరప్రత్యుత్తరాల్లో దళిత్ పదాన్ని తొలగించాలంటూ పంకజ్ మెష్రాం అనే వ్యక్తి వేసిన పిల్‌ను విచారించిన న్యాయస్ధానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘దళిత్‌’కు బదులు ‘షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొనాలంటూ సర్క్యులర్లు జారీ చేసిన న్యాయస్ధానం మీడియాలో సైతం ఈ పదాన్ని వాడరాదని తెలిపింది.

భారత రాజ్యాంగంలో దళిత్ పదం ఎక్కడ లేదని..దళిత్ పదానికి బదులు షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్ అని వాడాలని ముంబై హైకోర్టు అభిప్రాయపడింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇక నుంచి దళిత్ పదం నిషేధమని స్పష్టం చేసింది.

కోర్టు సూచనలను పాటించడానికి కేంద్ర సమాచార,ప్రసారాల మంత్రిత్వ శాఖ అంగీకరించింది . ఈ విషయంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI)కు సైతం ఆదేశాలు జారీ చేసింది న్యాయస్ధానం. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత్ పదాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నాయి.