కొందరు ఆయన్ని స్వరాష్ట్ర స్వాప్నికుడన్నారు. కొందరు తెలుగువారి మధ్యలో చిచ్చుపెట్టిన ప్రాంతీయవాది అన్నారు. కొందరు ఆయన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో నియంత అన్నారు. కొందరు నియంతృత్వ ధోరణులున్న ప్రజాస్వామ్య రక్షకుడన్నారు. కొందరు ఆయాన్ని పోరాటశక్తి అన్నారు. కొందరు కేవలం ఆరాటపరుడు అన్నారు. కొందరు ఆయన్ని రాజనీతి విద్వాంసుడన్నారు. కాని 4 కోట్ల తెలంగాణా ప్రజలకు ఆయన ఒక ఆశయ సారధి… వారి కలలను నిజం చేసిన మహా నాయకుడని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. త్వరలోనే మహానాయకుడి జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన దర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా అనుకున్నా, ఉద్యమంలో ఆయన ముందుకు సాగారు. ఇదంతా మనమందరం చూసిన చరిత్ర, చూస్తున్న వర్తమానం. కేసీఆర్ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైతే చిరునామాగా మారాయో, దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధొరణిలో చూడటం మొదలు పెట్టిందన్నారు.
1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను, విన్న ఆనాటి సంగతులు, చూసిన ఈనాటి సంఘటనలు నాలో ఉన్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనీయలేదు. ఆ క్రమంలో కొన్ని పరిశోధనలు చేసాను. తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిసాను. కొందరి మాటల ద్వారా ఎన్టీయార్, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్,సోనియా గాంధీ, చిరంజీవి, లగడపాటి రాజ్ గోపాల్, వెంకయ్యనాయుడు, అద్వాని ఇంకా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరు తెలుసుకున్నానని తెలిపారు.
మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. 2017 జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షూటింగ్ మొదలుపెట్టి… 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు.