క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయాలు తీసుకుంది.స్మిత్,వార్నర్,బాన్ క్రాప్ట్ ముగ్గురు దోషులేనని క్రికెట్ బోర్డు తేల్చింది. ఇందులో ఇంకెవరికీ పాత్ర లేదని సీఏ స్పష్టం చేసింది. ఈ ముగ్గురిపై తక్షణం జట్టు నుంచి సస్సెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్మిత్ స్ధానంలో వికెట్ కీపర్ టిమ్ ఫైన్ కెప్టెన్‌గా ఉంటాడని తెలిపింది.
అంతేగాదు సస్పెండ్‌కు గురైన ఈ ముగ్గురి స్ధానంలో మాథ్యూ రెన్షా, జోయ్ బర్న్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బరిలో దిగుతారని తెలిపింది. దోషులుగా తేలిన ఆటగాళ్లపై వచ్చే 24 గంటల్లో చర్య తీసుకుంటామని ప్రకటించింది.
లీమన్ కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు ఆసీస్ చీఫ్ జేమ్స్ సదర్‌ల్యాండ్. క్రికెటర్ల తరఫున అభిమానులకు క్షమాపణ చెప్పారు. క్రికెటర్ల ప్రవర్తన పట్ల ఆగ్రహంగా ఉన్న సదర్‌ల్యాండ్.. బాల్ ట్యాంపరింగ్ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్మిత్, వార్నర్‌లపై చర్యలు ఎలా ఉంటాయన్న దాన్ని బట్టే ఈ ఏడాది ఐపీఎల్లో వారు ఆడతారా లేదా అన్నది తేలుతుంది.
క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం పట్ల క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే సంబంధం ఉంటే స్మిత్ నోట.. లీడర్స్ గ్రూప్ అనే మాట ఎందుకు వచ్చిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.