సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం విధివిధానాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో సీఎం తీసుకున్న రక్షణ చర్యలతో దళితుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఈ విషయంలో ఆయన సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. దళితుల అభివృద్ధికి తమ సలహాలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. దళిత సమాజంలో మానసిక ఉత్తేజం కలిగినట్లు చెప్పారు. ఎస్సీల అభివృద్ది గురించి ఇంతగా తపించే మీకు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.
రైతుబంధు పథకం మాదిరిగా నేరుగా ఆర్థికసాయం చేస్తే దళితులు సంతోషిస్తారన్నారు. యాదగిరిగుట్టను ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దినందుకు అక్కడి నుంచి ఐదుసార్లు గెలిచిన వ్యక్తిగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలన్నారు. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆకాంక్షను నెరవేరుస్తుండటం ఆనందదాయకమని మోత్కుపల్లి పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు ప్రకటించండి అని సీఎం కేసీఆర్‌ను కోరారు మోత్కు పల్లి.