థియేటర్‌లోనే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’..

44
Most Eligible Bachelor

టాలీవుడ్‌ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించాడు. ఈ సినిమాను విడుదలపై చిత్ర బృందం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో తమకి అలాంటి ఉద్దేశమే లేదని తాజాగా నిర్మాతలు ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నామని స్పష్టం చేశారు. నిజానికి అఖిల్ కెరియర్ కి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే బలమైన నిర్ణయానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చేసింది కనుక, ఈ పుకార్లకు తెరపడిపోయినట్టే! ఇక చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కి కూడా ఈ సినిమా విజయం కీలకమే. అఖిల్ – పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందనీ, ఈ ఇద్దరి మధ్య రొమాన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని టాక్‌.