ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌..

51
Dubbaka polling

మంగళవారం జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఇచ్చినట్టు వెల్లడించారు. సాధారణ ఓటింగ్ 5 గంటలకే ముగియగా, చివరి గంట కొవిడ్ బాధిత ఓటర్ల కోసం కేటాయించారు. దుబ్బాక నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ 85 శాతం ఓటింగ్ జరిగింది.

తాజాగా, మొత్తం 315 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా, అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 23 మంది పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి దివంగత సోలిపేట రామలింగారెడ్డి అర్ధాంగి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ తరఫున చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో దిగారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న వెల్లడి కానున్నాయి.

కాగా, దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఝార్ఖండ్‌, కర్ణాటక, ఒడిశా, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసేంది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా గుజరాత్‌లో ఎనిమిది, యూపీలో ఏడు, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్‌, నాగాలాండ్‌లో రెండు చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి.