నిర్మల్‌లో వానర సంరక్షణ కేంద్రం సిద్ధం..

257
Monkey Conservation Center
- Advertisement -

వానలు సమృద్ధిగా కురవాలన్నా, కోతులు అడవులకు వెళ్లాలన్నా మొక్కల పెంపకం అనివార్యం. అందుకే, హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. అడవిలో ఉండే కోతులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి దేశంలోనే రెండో ప్రాజెక్టుగా, రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మల్‌ పట్టణ శివారులో వానర సంరక్షణ కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేయించారు. అధికారులు పూర్తి ప్రాజెక్టు నివేదికను రూపొందించారు పనులు ఇప్పటికే పూర్తయి ప్రారంభానికి సిద్ధం అయ్యింది.సహ్యాద్రి పర్వతాల మధ్య వెలసిన నిర్మల్‌ పట్టణం చుట్టూ ఎత్తైన గుట్టలు, ఏపుగా పెరిగిన వృక్షసంపద అందుబాటులో ఉంది. దీంతో ఇది సహజంగానే కోతులకు ఆవాసంగా మారింది. పైగా జనావాసాలకు దూరంగా అటవీప్రాంతం ఉండటంతో ఇక్కడ వానరాల పునరావాస కేంద్రం ఏర్పాటుచేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. గత నవంబరు 20, 2017న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ నెల 20 న కేంద్రాన్ని ప్రారంభించేందుకు అటవీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

జనాభా నియంత్రణే ప్రధానంగా..
అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట కోతులు మనుషుల్ని గాయపరిచిన సంఘటనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక కోతిని కొట్టడానికి ప్రయత్నిస్తే పదుల సంఖ్యలో కోతులు కరవడానికి పరుగులు తీస్తూ వస్తాయి. రహదారి వెంట కోతులు కనిపించాయంటే చాలు వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే వాటి బెడద ఎంత తీవ్రమైందో అర్థమవుతుంది. ఒక్క అదిలాబాద్‌లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇదే తరహా పరిస్థితి. అందుకే కోతి చేష్టలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం నిర్మల్‌ జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో వానర సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. కోతుల జనాభాను నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను తొలుత ఈ కేంద్రానికి తీసుకొస్తారు. కనీసం వారం రోజుల పాటు ఈ కేంద్రంలో ఉంచి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తారు. తదనంతరం వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తర్వాత 10 నుంచి 15 రోజుల పాటు వాటిని పరీక్షించి ఆపై ఆ కోతులను సమీపంలోని అడవుల్లో వదిలేస్తారు. ఒకేసారి 300 కోతులను సంరక్షించేలా ఈ కేంద్రం సిద్ధం చేశారు.ఈ కేంద్రంలో పశువైద్యాధికారి, సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, పరికరాలను ఏర్పాటు చేశారు… కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారుచేశారు. సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు.

పూర్తయిన శిక్షణ..
కేంద్రంలో పనిచేసేందుకు ముగ్గురు పశువైద్యాధికారులను నియమించారు. వీరికి హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న కోతుల పునరావాస కేంద్రంలో వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందజేశారు. పట్టుబడ్డ కోతుల్లో ఆడ, మగవాటికి వేర్వేరుగా బంధించడం, వాటికి కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయడం, ఏర్పడే ఇబ్బందులు, అధిగమించే విధానాలను వివరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని వెటర్నరీ కళాశాల, పి.వి.నరసింహారావు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అవసరమైన సహాయ సహకారాలు అందించారు. వైద్యులకు తోడుగా ఇతర సాంకేతిక సిబ్బంది, సహాయకులను నియమించారు. విద్యుత్తు సౌకర్యం కోసం ప్రత్యేకంగా జనరేటర్‌ను ఏర్పాటుచేశారు. నీటి ఇబ్బందుల్లేకుండా మూడు బోర్లువేశారు.

పండ్ల మొక్కల పెంపకం..
కోతులకు కావాల్సిన ఆహార పదార్థాలు అడవుల్లో లభించక పట్టణాలు, పల్లెల్లోకి వచ్చి మకాం వేస్తున్నాయి. ఈ కారణంగా కోతులను నియంత్రించడానికి చర్యలు చేపట్టారు. అడవుల్లో వాటికి ఆహారం కోసం పండ్ల మొక్కలు నాటేందుకు అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతాల్లో జామ, ఉసిరి, చింత, అల్లనేరేడు, అడవి మామిడి, తదితర రకాల పండ్ల మొక్కలు నాటారు.. తద్వారా చాలావరకు కోతులు అడవుల్లోనే ఉంటాయి. ఫలితంగా ప్రజల ఇబ్బందులూ దూరమవుతాయి.

- Advertisement -