ఇరాన్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైనట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. దీర్ఘకాలం దేశాన్ని నడిపించిన అయతొల్లా అలీ ఖమేనీ అనంతరం నాయకత్వ మార్పు జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవాలని ఆ దేశ మత పెద్దలపై IRGC ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అధికారిక హోదా లేకపోయినా, గత కొన్నేళ్లుగా తండ్రి కార్యకలాపాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాలు, భద్రతా వ్యవస్థ, మతపరమైన నిర్ణయాల్లో ఆయన ప్రభావం గణనీయంగా ఉందని భావిస్తున్నారు.
ఇరాన్‌లో సుప్రీం లీడర్‌కు అత్యున్నత అధికారాలు ఉంటాయి. దేశ విదేశాంగ విధానం, రక్షణ, అణు కార్యక్రమం వంటి కీలక అంశాలపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారు. అలాంటి కీలక పదవిలో మొజ్తాబా ఖమేనీ నియామకం ఇరాన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. తండ్రి వారసుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించడం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లుగా భావిస్తున్నారు.
Also Read:విజయ్ – రష్మికా రిసెప్షన్..కండీషన్స్ అప్లై!

