సోనియాకు ఫిర్యాదు..కట్‌చేస్తే సస్పెండ్!

6
- Advertisement -

సోనియా గాంధీకి ఫిర్యాదు చేసిన ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్వీమ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు కాంగ్రెస్ సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయం, పార్టీ రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న దయనీయ పనితీరుపై నాయకత్వ మార్పు అవసరమని కోరుతూ మొక్వీమ్ సోనియా గాంధీకి లేఖ రాసిన కొద్ది రోజులకే వెలువడింది.

ఈ మేరకు కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా శ్రీ మహమ్మద్ మొక్వీమ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించేందుకు ఏఐసీసీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది అని తెలిపింది.

సోనియా గాంధీకి రాసిన ఐదు పేజీల లేఖలో మొక్వీమ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేత రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మరియు గ్రాస్‌రూట్ కార్యకర్తల మధ్య దూరం పెరుగుతోందని ఆయన ఆరోపించారు. 83 ఏళ్ల ఖర్గే యువతతో అనుసంధానం ఏర్పరచుకోవడంలో విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రస్థాయిలో మరింత ‘స్పష్టమైన, క్రియాశీల పాత్ర’ పోషించాలంటూ సూచించారు.

కాంగ్రెస్‌లో నిర్లక్ష్యం, గుర్తింపులేమి కారణంగా జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా, హిమంత బిస్వ శర్మ వంటి యువ నేతలు పార్టీని వీడారని ఆయన గుర్తుచేశారు. గత మూడు సంవత్సరాలుగా తాను రాహుల్ గాంధీని కలవలేకపోయానని కూడా పేర్కొన్నారు.తప్పు నిర్ణయాలు, దారితప్పిన నాయకత్వ ఎంపికలు, బాధ్యతలను తప్పు చేతుల్లో కేంద్రీకరించడం వల్ల పార్టీ అంతర్గతంగా బలహీనపడింది. ఈ పొరపాట్లను సరిదిద్దడం కాకుండా మళ్లీ మళ్లీ అవే చేస్తూ వస్తున్నాం. దాని ఫలితాలు ఇప్పుడు దేశమంతా చూస్తోంది” అని మొక్వీమ్ వ్యాఖ్యానించారు.

Also Read:BB9:భరణి ఎలిమినేట్

భారత్ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపే ఉన్నారని పేర్కొన్న ఆయన, దేశం మరియు పార్టీ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం మరియు భారత యువత మధ్య లోతైన అంతరం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -