తనను కొడుకులా చూసుకున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడేండ్లలో తామెప్పుడు కలుసుకున్నా ఆయన తనపై ఆప్యాయత చూపని రోజు లేదని మోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ప్రణబ్ విధులపై రచించిన ‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మ్యాన్’ పుస్తకాన్ని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం మోడీ విడుదలచేశారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, తాను ఢిల్లీలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రణబ్ చేయిని పట్టుకోగలగడం తన అదృష్టమని చెప్పారు. నా మనస్సు లోతుల్లో నుంచి చెప్తున్నాను. ఆయన నన్ను ఒక కొడుకులా చూసుకున్నారు.. అంటూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. మోడీజీ మీరు కనీసం సగం రోజైనా విశ్రాంతి తీసుకోవాలి అని ప్రణబ్ చెప్పేవారు. ఎందుకు అలా పరుగెత్తుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నాకు ఓ మాట చెప్పారు. విజయాలు, అపజయాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని, ఆరోగ్యంపైనా కాస్త దృష్టి పెట్టాలని సూచించారు. ఇవన్నీ రాష్ట్రపతి విధుల్లో భాగం కాదు. ఆయన చెప్పే మాటల్ని జాగ్రత్తగా గమనిస్తే.. స్నేహితుణ్ని కాపాడే ఓ మానవతావాది కనిపిస్తారని మోడీ అన్నారు. స్టేట్స్‌మన్ పత్రిక ప్రచురించిన ఈ పుస్తకంలోని చిత్రాలు చూస్తే తమ రాష్ట్రపతి చిన్న పిల్లాడిలా నవ్వగలడని ప్రజలు తెలుసుకుంటారు అని మోడీ చెప్పారు.
రాష్ట్రపతి ప్రణబ్ సైతం మోడీపై ప్రశంసలు కురిపించారు. తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని తమ వద్దనే పెట్టుకొని కలిసి పని చేశామని చెప్పారు. రాష్ట్రపతికి, ప్రధానికి మధ్య సంబంధాలను అవి ప్రభావితం చేయలేదని అన్నారు. ప్రభుత్వ సేవలు ఏనాడూ నిలిచిపోలేదని, అవాంతరాలు ఎదురుకాలేదని, జాప్యాలూ చోటుచేసుకోలేదని కచ్చితంగా చెప్పగలనని ప్రణబ్ వ్యాఖ్యానించారు. ఏ విషయంలోనైనా స్పష్టత కావాల్సి వస్తే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని అడిగేవాడినని చెప్పారు.