శనివారం భారత ప్రధాని మోదీ శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు వర్చువల్ ప్లాట్ ఫామ్ లో జరగడం విశేషం. ఈ సమావేశం ప్రారంభంలో ప్రధాని మాట్లాడుతూ.. భారత్-శ్రీలంక దేశాల మధ్య కొనసాగుతున్న బంధం ఈనాటిది కాదని, వేల ఏండ్ల నాటిదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అదేవిధంగా శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని అయినందుకు రాజపక్షేను అభినందించారు. ఇరు దేశాల ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మన వైపు చూస్తున్నారని తెలిపారు.
శ్రీలంకతో సంబంధాలకు తాము ఎప్పుడైనా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానులు ఇద్దరూ చర్చించారు. కరోనా పరిస్థితుల్లో సైతం భారత్ తమ దేశానికి అందించిన సహకారానికి కృతజ్ఞతలు అని శ్రీలంక ప్రధాని పేర్కొన్నారు. ఎంటీ న్యూ డైమండ్ నౌకలో చెలరేగిన మంటలు ఇరుదేశాల మధ్య గొప్ప సహకారానికి అవకాశం కల్పించాయని రాజపక్షే అభిప్రాయపడ్డారు.
ఇటీవల జరిగిన శ్రీలంక ఎన్నికల్లో రాజపక్ష ప్రభుత్వం మరోసారి ఘన విజయం సాధించడంతో ఇరు దేశాల మధ్య సహాయసహకారాలు మరింత బలపడతాయని చెప్పారు. ఇరు దేేశాల మధ్య మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మరో అవకాశం వచ్చిందని అన్నారు. వర్చువల్ ప్లాట్ ఫామ్ ద్వారా మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.