ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాందీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లో మన్మోహన్ పై చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చిన రాహుల్ … మోడీకి ఇతరుల బాత్రూమ్‌లోకి తొంగి చూసే అలవాటు ఉందన్నారు. లక్నోలో అఖిలేష్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన రాహుల్ ఆయనకు ఉన్నది ఇక రెండున్నరేళ్లేనని అన్నారు. ఎవరైన ప్రశ్నిస్తే తట్టుకోలేక ఎదుటివారిపై విమర్శలు చేయటం మోడీకి అలవాటేనన్నారు.
గుగుల్‌లో తన పేరుమీద సెర్చ్ చేస్తే జోకులు వస్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ నేత తిప్పికొట్టారు. ప్రధాని గూగుల్‌ను సెర్చ్ చేస్తారు కానీ, ప్రజల సమస్యలను పరిష్కరించలేరన్నారు రాహుల్. గడిచిన రెండున్నరేళ్లలో మోడీ దారుణంగా విఫలమయ్యారని రాహుల్ చెప్పారు. ఇక సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు విషయంలో ఆరేడు సీట్ల విషయంలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరించుకుంటామని తెలిపారు. 99 శాతం సీట్లు సాధించుకోడానికే ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు.
ఇక ప్రజలు ఇప్పటికీ అచ్ఛేదిన్ కోసం ఎదురు చూస్తున్నారని, కొంతమంది మన్‌కీ బాత్ చెబుతున్నారు గానీ కామ్ కీ బాత్ చెప్పడం లేదని యూపీ సీఎం అఖిలేష్ సైతం విమర్శల పర్వం కొనసాగించారు. ఇవి ఎన్నికలని.. ఎవరూ భావోద్వేగాలకు, కోపానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇదిఇలా ఉండగా రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుకున్న కుంభకోణాల గురించి ప్రస్తావించిన మోడీ ‘బాత్రూంలో రెయిన్ కోటు వేసుకుని స్నానం చేయడం ఎలాగో ప్రజలు మన్మోహన్ సింగ్ నుంచి నేర్చుకోవాల’ని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో గందరగోళం నెలకొనగా రాహుల్ మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.