ఢిల్లీలోని ప్రఖ్యాత క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ రిడెంప్షన్లో నిర్వహించిన క్రిస్మస్ ప్రార్థనల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యేసు ప్రభువు జననాన్ని స్మరించుకుంటూ గురువారం ఉదయం జరిగిన మార్నింగ్ క్రిస్మస్ ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రేయస్సు కోసం దిల్లీ బిషప్ పాల్ స్వరూప్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మోదీ భక్తిశ్రద్ధలతో పాల్గొని క్రైస్తవ సమాజానికి సంఘీభావం తెలిపారు.
ఈ విషయాలను తెలియజేస్తూ ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. దేశ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, కరుణ, ఆశలు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని సూచించారు. యేసు క్రీస్తు బోధనలు సేవాభావాన్ని, సామాజిక సామరస్యాన్ని, సోదరభావాన్ని, పరస్పర గౌరవాన్ని బలోపేతం చేయడానికి మార్గనిర్దేశం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ విలువలు సమాజాన్ని మరింత ఐక్యతతో ముందుకు నడిపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గత కొన్నేళ్లుగా క్రైస్తవులకు సంబంధించిన పర్వదినాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ నిరంతరం పాల్గొంటున్నారు. 2023లో దిల్లీలోని సేక్రెడ్ హార్ట్ క్యాథడ్రల్లో నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు హాజరయ్యారు. అదే ఏడాది క్రిస్మస్ సందర్భంగా దిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, క్రైస్తవ మతపెద్దలను ఆహ్వానించారు. 2024లో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో నిర్వహించిన విందులో పాల్గొన్నారు. అలాగే గత ఏడాది క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొని, మత సామరస్యానికి తన కట్టుబాటును చాటుకున్నారు.
Also Read:ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

