నోయిడాలోని జేవర్‌లో నిర్మిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఒక రాష్ట్రానికి అధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లక్నోలో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి మంత్రివర్గ సమావేశానికి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ నిరంతర ప్రజాసేవకు గుర్తింపుగా విమానాశ్రయం పేరు మార్పునకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వివరించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. దేశాన్ని ముందుండి నడిపిస్తూ, ప్రజాప్రతినిధిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.మోదీ నాయకత్వంలో భారతదేశం తన నాగరికత విలువలను కాపాడుకుంటూనే ప్రపంచ వేదికపై కొత్త గుర్తింపును సాధించిందని యోగి అన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో వారసత్వ సంపద పరిరక్షణతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కొత్త శకం ప్రారంభమైందని తెలిపారు.
ప్రధాని మోదీకి, ఉత్తరప్రదేశ్‌కు మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని ఆయన వ్యాఖ్యానించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంకల్పం, ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తి, సమన్వయంతో పనిచేస్తున్న ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం కారణంగా ఉత్తరప్రదేశ్ అపూర్వమైన ప్రగతి దిశగా ముందుకు సాగుతోందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Also Read:భారత్‌తో టీ20 సిరీస్..డబుల్ షాక్!

