ఈ రోజు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పటాన్‌చెరులోని ఇక్రిశాట్ను సందర్శించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ ప్రత్యేక ఆయన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అందరికీ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. అజాదీ అమృతోత్సవాల వేళ ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందని పేర్కొన్నారు. ‘ఇక్రిశాట్ సేవలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. టెక్నాలజీని మార్కెట్‌తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తోంది.
వాతావరణ పరిశోధన కేంద్ర రైతులకు ఎంతో ఉపయోగకరం. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మానవ నష్టం గురించి చర్చిస్తాం. కానీ మౌలిక సదుపాయలకు జరిగిన నష్టం గురించి మాట్లాడం. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధలనకు భారత్ వేదికగా మారింది. ఇందుకోసం భారత్ ఎన్నో చర్యలు తీసుకుంది. ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగకరం’ అని మోదీ అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పంటల దిగుబడి గణనీయంగా ఉంది. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్తదారి చూపించాలి. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలి. వాతావరణ మార్పులు తట్టుకునే వంగడాలు సృష్టించాలి. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదపడుతాయన్నారు.
అంతకు ముందు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోదీని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యుస్ సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ప్రధాని మోదీ ఇక్రిశాట్ 50 వసంతాల లోగోతో పాటు పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు ఇక్రిశాట్లో సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. మెట్ట పంటల పరిశోధనలను మోదీకి శాస్త్రవేత్తలు వివరించారు. మోదీ ఆసక్తిగా విన్నారు. స్వర్ణోత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

