హైదరాబాద్ ప్రజల మెట్రో కలను నేరవేర్చడంతో పాటు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న మోడీకి ఘనస్వాగతం లభించింది. బేగంపేటలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్,మంత్రులు,బీజేపీ నేతలు మోడీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
బీజేపీ నేతలతో మోడీ భేటీ అయ్యారు. అనంతరం బేగంపేట నుంచి మియాపూర్‌కు చేరుకోనున్న మోడీ మెట్రో ప్రారంభ పైలాన్ ఆవిష్కరించి మెట్రోను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో కలిసి మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు, తిరిగి కూకట్ పల్లి నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో జర్నీ చేయనున్నారు.
అక్కడి నుంచి 2.50కి మియాపూర్ నుంచి హెలికాప్టర్లో హెచ్‌ఐసీసీ కి చేరుకుంటారు ప్రధాని. ఇవాంక ట్రంప్ తో 20 నిమిషాలు భేటీ అవుతారు. 4.50 నుంచి 5.10 వరకు ప్రధాని మోడీ ప్రసంగం ఉండనుంది. సాయంత్రం 5.30 నుంచి 2 గంటల పాటు విదేశీ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు మోడీ.
రాత్రి 7.30 కు రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ కు బయల్దేరి 8 గంటల వరకు అక్కడకు చేరుకుంటారు. ఇవాంక, సదస్సులో పాల్గొనే ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు మోడీ. రాత్రి 10 గంటలకు ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 10.30 గంటలకు గుజరాత్ రాజ్ కోట్ కు ప్రయాణమవుతారు.