బెంగళూరులో జరుగుతున్న 14వ ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నానని మోదీ అన్నారు. 21వ శతాబ్దం మన దేశానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాతృదేశానికి తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశాల్లో 30 మిలియన్ల భారతీయులు నివసిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా భారతీయ కుటుంబం ఉందని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని చెప్పారు. భారతీయులు ఎక్కడున్నా కష్టించి పనిచేయడం, పర్యావరణాన్ని ప్రేమించడం చేస్తుంటారని అన్నారు. తాము ఎంచుకున్న రంగాల్లో ప్రవాస భారతీయులు విశేషంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నారైలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రవాసులు సంక్షేమం, సంరక్షణ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. విదేశాల్లో ప్రవాసుల అవసరాలు, సమస్యలపై వెంటనే స్పందించాలని రాయబార కార్యాలయాలను ఆదేశించామన్నారు.
విదేశాల్లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న భారతీయ యువత కోసం ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకం ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. భారతి చెందిన వారు తమ దగ్గరున్న పీఐఓ కార్డులను ఓవర్ సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులుగా మార్చుకోవాలని కోరారు. దీనికి నిర్దేశించిన గడువును జూన్ 30 వరకు పొడిగించినట్టు చెప్పారు. సుందరమైన నగరమైన బెంగళూరులో ప్రవాసీ భారతీయ దివస్ జరగడం సంతోషంగా ఉందంటూ ఎన్నారైలకు శుభాకాంక్షలు తెలిపారు.