నాగబాబు జాగ్రత్త రోడ్డున పడతావు..వర్మ

234
Naga Babu
- Advertisement -

‘ఖైదీనంబర్‌ 150’ ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగా బ్రదర్‌ నాగబాబు రచయిత యెండమూరి వీరేంద్రనాథ్‌, దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై చేసిన విమర్శలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘ఖైదీనంబర్‌ 150’ వేడుకలో నాగాబాబు మాట్లాడుతూ.. ‘తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముంబై వెళ్లిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. ఈ కూతలు ఆపేసి దర్శ కత్వం సక్రమంగా చేసుకుని, ఆ బాంబ్‌ ఏదో అక్కడే ముంబై లో పేల్చుకుంటే… వాడికీ మంచిది, మాకూ మంచిది. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? ఆయన ఎలా చేయాలి? అని మాట్లాడడం. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలతో మాకేం కాదు. ఇలాంటి పక్షి ఎన్ని కూతలు కూసినా.. సూపర్‌హిట్‌ సినిమాని ఆపలేవు. ఫెయిల్యూర్‌ సినిమాని లేపలేవు’’ అంటూ వర్మపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తనపై విమర్శలు చేసిన నాగబాబుకు అంతే ఘాటుగా వర్మ బదులిచ్చారు.

Naga Babu

“నాగబాబు సార్… ఎన్నో కుటుంబాలు నా కెరీర్ కారణంగా నడుస్తున్నాయి. కేవలం నీ అన్న కుటుంబం కారణంగానే నీ కెరీర్ నడుస్తోంది. నీకు కావాలంటే ఈ విషయంలో మరింత వివరంగా ట్వీట్ చేస్తాను” అని దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. శనివారం రాత్రి 10 గంటల నుంచి తన ట్విట్టర్ ఖాతా ద్వారా నాగబాబుపై విరుచుకుపడుతూ ట్వీట్ల వర్షం కురిపించాడు. అక్కుపక్షులపై మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా, నీ అన్నను మచ్చిక చేసుకునే విషయంపై దృష్టిని సారించాలని, లేకుంటే రోడ్లపై పడతావని హెచ్చరించాడు.

Naga Babu

“చిరంజీవిగారూ, అతను మీ సోదరుడని తెలుసు. మీరు అతన్ని ప్రేమిస్తున్నారనీ తెలుసు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లకు అతన్ని తీసుకురావద్దు” అని చిరంజీవికి ఓ సలహా ఇచ్చాడు. మీ గొప్పతనాన్ని, మీరు సాధించిన లక్ష్యాలను కించపరుస్తున్నారని, ఇందుకు బాధగా ఉందని చెప్పాడు. ప్రమాదం పక్కనే ఉందని, దాన్ని మీరు తెలుసుకోగలరని ఓ అభిమానిగా భావిస్తున్నానని అన్నాడు. కేవలం తమ్ముడని మాత్రమే నాగబాబును మీరు భరిస్తున్నారన్న విషయం తనకు తెలుసునని, మీరు అతనికి చేసిన దానితో పోలిస్తే, అతను మీకు చేసింది శూన్యమని అన్నాడు.

‘ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి సలహా ఇచ్చావో అందరికీ తెలుసు’ అంటూ నాగబాబుకి వర్మ చురక అంటించాడు. ‘నాగబాబు సార్, మీకు ఇంగ్లిష్‌ అర్థం కాదు కనుక, విద్యావంతుడైన స్నేహితుడి ద్వారా నా ఇంగ్లిష్‌ ట్వీట్లు తర్జుమా చేయించుకుని తెలుసుకోండి’ అంటూ సూచించాడు. గ్రేట్‌ మెగా బ్రదర్‌ ముందు నాగబాబు 0.01 శాతం మాత్రమేనని, అందుకే నాగబాబులా చిరంజీవి అర్థంపర్థం లేని వాగుడు వాగాలేదని ఘాటుగా చురకలంటించారు. చిరంజీవికి గుడ్ నైట్ చెబుతూ, నాగబాబు కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి అతని తరపున తాను క్షమాపణలు చెబుతున్నట్టు రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు. ఇకపోతే ‘నాగబాబు సార్, ఇప్పుడే 150 ట్రైలర్ చూశాను…చాలా బాగుంది…అవతార్ కంటే కొంచెం గొప్పగానే ఉంది’ అంటూ రాంగోపాల్ వర్మ తనదైన స్టయిల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

- Advertisement -