కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల దాడి కొనసాగుతోంది. ఆదివారం (డిసెంబర్-10) గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో మోడీ రెండో దశ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీతో కలిసి భారత్ లో పాక్ హైకమిషనర్ సోహైల్ మహమ్మద్ తో మణిశంకర్ అయ్యర్ సమావేషమయ్యారనే వార్తలను ఆయన ప్రస్తావించారు.
ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు జరిగిందని, పాకిస్థానీయులతో రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరమేంటని మోదీ ప్రశ్నించారు. పాక్ నేతలతో కాంగ్రెస్ నేతల భేటీని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు మోడీ.. దీనిపై భారత ప్రజలకు కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా.. ప్రధాని నీచమైన వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించడంపై మోడీ నిప్పులు చెరిగిన విషయం విదితమే. అయితే..పాక్ నేతలతో భేటీ అయిన మరుసటి రోజే అయ్యర్ తనపై అలాంటి వ్యాఖ్యలు చేశారని మోదీ తెలిపారు.