మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రధాన మంత్రి కిసాన్ పెన్షన్ యోజన పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ప్రతినెలా రూ.3,000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో మాట్లాడారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.వీలైనంత త్వరగా పథకాన్ని ప్రారంభించాలని కోరారు.
పెన్షన్ పొందాలంటే రైతులు పెన్షన్ ఫండ్‌కు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ ఫండ్‌కు మీరు చెల్లించిన డబ్బుకు సమానమైన మొత్తాన్ని జమచేస్తుంది. బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ పెన్షన్ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. తొలి మూడేళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని కేంద్రం భావిస్తోంది.
18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న రైతులను స్కీమ్ కోసం నమోదు చేసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. అర్హులైన సన్నకారు రైతులకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తారు. 29 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరితే నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.