ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం..

674
Oil palm
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించే క్రమంలో మరియు రైతుల ఆదాయం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఆయిల్ ఫామ్ పంటను ప్రధాన పంటగా మరియు సరిహద్దు మొక్కలు టిష్యుకల్చర్ (టేకు, శ్రీ గంధం) స్థిరమైన నమూనాను తెలంగాణ ఉద్యాన శాఖ రైతులకు సిఫారసు చేసింది. ఈ పంటల గురించి వివరంగా తెలిపింది. ఒక రైతుకీ 5 ఎకరాల సాగు భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటితే ఒక ఎకరానికి 9 x9 మీ దూరంతో 57 మొక్కల చొప్పున మీ 5 ఎకరాలకు 285 మొక్కల సాంద్రత వస్తుంది. ఈ 5 ఎకరాల పొలం సరిహద్దులో చుట్టుకొలత సుమారుగా 630 చ.మీ. ఉంటుంది. ప్రతి 3 మీ. ఒక శ్రీ గంధం మొక్క నాటి, దీని మధ్యలో ఒక టేకు మొక్క గనుక నాటితే 5 ఎకరాల పొలం సరిహద్దులో 250 టేకు మొక్కలు మరియు 250 శ్రీ గంధం మొక్కలు నాటుకొనవచ్చు.

ఆయిల్ ఫామ్ మొక్క నాటిన సంవత్సరం నుండి 5 సంవత్సరాల తరువాత గెలలు వేయడం, దిగుబడి మొదలవుతుంది. ఈ పంట 25 –30 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చును. సుమారుగా ఒక ఎకరానికి 10–12 టన్నులు గెలల దిగుబడి వస్తుంది. సగటును 1 టన్ను గెలల ధర సుమారు 10 వేల రూపాయలుగా ఉంటుంది. దీని ద్వారా ఒక రైతుకు ఒక ఏకరకు రూ.1.25 లక్షల ఆదాయం పొందవచ్చు. ఈ విధానంలో 5 ఎకరాలకు 6.0 లక్షల నికరాదాయం పొందుతారు. 5 ఏకరాలకుగాను 20 సంవత్సరాల కాలంలో 1.20 కోట్ల నికరాదాయం పొందుతారు.

గట్లమీద మొక్కల వివరాలలోకి వెళితే.. 250 మొక్కల శ్రీ గంధం మొక్కల నుండి 5 టన్నుల హార్ట్ వుడ్ వస్తుంది, దీనికి గాను ఒక కేజీ హార్ట్ వుడ్ కి రూ.8000/- చొప్పున 5 టన్నులకు గాను రూ.4.00 కోట్ల ఆదాయం వస్తుంది. 250 మొక్కల టిష్యుకల్చర్ టేకు నుండి 6250 ఘనపుటడుగు (cubic feet) కలప వస్తుంది, దీనికి గాను ఒక ఘనపుటడుగుకు రూ.2000/- చొప్పున 6250 ఘనపుటడుగులకు రూ.1.25 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఈ 3 పంటల నుండి 20 సంవత్సరాల కాలంలో రైతుకు వచ్చే నికరాదాయం సుమారు రూ.6.45 కోట్లు. దీనిని నెలవారి ఆదాయంలో విశ్లేషిస్తే నెలకు రూ.2.69 లక్షల నికరాదాయం పొందుతారు.

- Advertisement -