సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ పల్లా..

224
MLC Palla Rajeshwar Reddy
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి వరాలను ప్రకటించినందులకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగుకు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల చిరకాల కోరిక నెరవేరుతుంది. అందుకోసం అవసరమైన నిధులను కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.

ప్రజాభిప్రాయ మేరకు వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా నామకరణం చేయడంతో పాటుగా వరంగల్ రూరల్ జిల్లాకు వరంగల్ లోని ఆజంజహి మిల్ ఆవరణలో సమగ్ర కలెక్టర్ భవన సముదాయాన్ని నిర్మించుటకు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. రెండు వందల ఎకరాల స్థలంలో ఉన్న ఎంజీఎం, కేయంసి, కంటి ఆసుపత్రి, సెంట్రల్ జైల్ ప్రాంగణాలను హెల్త్ హాబ్‌గా తీర్చిదిద్దటంతో పాటుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 33 అంతస్తులలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టి ఏడాదిన్నరేళ్ళలో పూర్తి చేయాలని ఆదేశించడం శుభపరిణామం అన్నారు.

దీనికి తోడుగా వరంగల్ నగరంలో ప్రభుత్వ డెంటల్ వైద్యశాల, డెంటల్ ఆసుపత్రి మంజూరు వల్ల వరంగల్ నగరంలో పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజల మనసుకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరాలిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లాను విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో మరింత అభివృద్ది చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -