రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. జూబ్లీహిల్స్‌లోని రైతు సమన్వయ సమితి కార్యాలయంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
ఈసందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటాను. రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. రైతులను సంఘటితం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యం. తెలంగాణ 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు తమకు కూడా కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుటకుంటున్నరు. రైతులకు మేలు జరిగే విధంగా పనిచేస్తానని అన్నారు.