ఆకలి, పోషకాహార లోపం సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం బృందం ప్రశంసించింది. ఇండియా నుంచి ఆకలి, పోషకాహారలోపం సమస్యలను పారదోలడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, ఎన్.జి.వోలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచ ఆహార కార్యక్రమం భారత డైరెక్టర్ బిషో పారాజులి. తమతో కలిసి పనిచేయాలని తెలంగాణ జాగృతికి ప్రపంచ ఆహార కార్యక్రమం (WORLD FOOD PROGRAMME-UNO) ఆహ్వానం పలికింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితతో ఇవాళ వర్చువల్ మీటింగ్లో మాట్లాడిన ఆహార కార్యక్రమం బృందం, పోషకాహార లోపంపై కౌమార బాలికల్లో అవగాహన కోసం ఎమ్మెల్సీ కవిత తీసుకున్న చర్యలను ప్రశంసించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతలు, గర్భిణీలతో పాటు సహాయకులకు కూడా పౌష్టికాహారాన్ని అందించడం గొప్ప విషయమన్నారు బిషో పారాజులి. ఈ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత… కరోనా ఆపత్కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అన్నపూర్ణ కేంద్రాలతో పేదలకు ఉచితంగా అందిస్తున్న భోజనం గురించి చెప్పారు. దీంతో పాటు వలస కూలీల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫుడ్ బ్యాంకులతో కలిగిన ప్రయోజనాలను తెలిపారు. మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచ ఆహార కార్యక్రమం బృందానికి ఎమ్మెల్సీ కవిత వివరించారు.
ఐక్యరాజ్య సమితికి (UNO) చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంస్థ. ఆకలి సమస్యను ఎదుర్కోవడం, ఆహార భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ సంస్థ విశేష సేవలందిస్తోంది. పేద దేశాలతో పాటు యుద్ద ప్రాంతాల్లో ఈ సంస్థ వెలకట్టలేని సేవలు చేస్తోంది. ఈ సంస్థ సేవలకు 2020లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.