టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీపైనా ఆమె విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో 2019 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న అరవింద్‌కు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు అవసరమైనంత సమయం ఇచ్చేందుకే ఈ మూడేళ్లు ఆయనపై తాను ఎలాంటి విమర్శలు చేయలేదని తెలిపారు.
అయితే మూడేళ్ల కాలంలో తనను గెలిపించిన నిజామాబాద్ ప్రజలకు అరవింద్ చేసిందేమీ లేదన్నారు. పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయంతో పాటుగా ఇతరత్రా కేంద్రం నుంచి వచ్చిన అన్ని కూడా తాను ఎంపీగా ఉన్నప్పుడు వచ్చినవేనని ఆమె తెలిపారు. ఇప్పటికైనా నిజామాబాద్‌కైనా, యావత్తు తెలంగాణకైనా సేవ చేసేవాళ్లు ఎవరన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.