Kavitha:రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపేయించాలి

33
- Advertisement -

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల టెండర్ల రద్దు చేయాలన్న ఆలోచనను కట్టిపెట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రస్తావించారు. టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఎందుకు పిలవాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిజైన్ మార్చనప్పుడు ఆయకట్టు పెంచనప్పుడు ఎందుకు టెండర్లు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటు మిగిలిన అనుమతలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రధాని మోదీతో కేసీఆర్ కు సత్సంబంధాలు లేవు కాబట్టి జాతీయ హోదా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, మరి ప్రధాని సత్సంబంధాలు పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి జాతీయ హోదా సాధించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగిలిన అనుమతులు, జాతీయ హోదా తీసుకొచ్చే అంశాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో అన్నసాగర్ గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కవిత గారు పరామర్శించారు. అనంతరం మహబూబ్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాట చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాట్లాడారు.

గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రాజెక్టుపై కోర్టుల్లో, జాతీయ హరిత ట్రైబ్యునల్ లో కేసులు వేయించి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది తాగునీటి ప్రాజెక్టు కాబట్టి ఆపకుండా రిజర్వాయర్లను పూర్తి చేశామని తెలిపారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి అనుమతులు పొందడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని, తద్వారా జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రీటెండర్లంటూ కాలయాపన చేస్తే మరో రెండు పంటలకు నీళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని, త్వరగా పనులు పూర్తి చేస్తే వచ్చే వర్షకాలంలో నీళ్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో సంగమేశ్వరం వద్ద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును నిర్మించే ధైర్యం చేయలేదని, అనుమతి లేని రాయలసీమ ప్రాజెక్టును కేసీఆర్ ఆపారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రాజెక్టును కొనసాగించకుండా చూడాలని అన్నారు. పక్కనే కృష్ణా నది ఉన్నా కూడా పంటలు పండక ఇక్కడి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చబడాల్సిందేనన్న సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పనిచేశారని వివరించారు. ఒకప్పుడు నీళ్లు లేకుండేనని, బీఆర్ఎస్ హయాంలో పట్టుబట్టి అనేక పనులు చేసి నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. కృష్ణా జలాలను శాశ్వతంగా పాలమూరుకు మళ్లించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ హయాంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 90 శాతం పూర్తి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు పరిస్థితి ఏనుగు ఎల్లింది తొక చిక్కింది అన్నట్లు ఉందన్నారు. 69 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టులో ఐదు రిజర్వాయర్లు ఉన్నాయని, కాలువల పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని, నార్లాపూర్ లో కేసీఆర్ ట్రయల్ రన్ ను కూడా ప్రారంభించారని వివరించారు. మొత్తం ప్రాజెక్టులో కేవలం 10 శాతం పనులే మిగిలి ఉన్నాయని, అవి పూర్తి చేసుకుంటే మరో 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందే ఆస్కారం ఉందని అన్నారు.

పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి మంచినీట కొరత లేకుండా చేయడమే కాకుండా 11 లక్షల ఎకరాల్లో పంట పండేలా చేశామని తెలిపారు. మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని భావించామని, కానీ ఎన్నికల నేపథ్యంలో రకరకాల అంశాల రీత్యా అనుకున్న మేర ఫలితాలు రాలేదన్నారు. ఉద్యమంలో నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక అడుగు వెనుకకుపడితే పది అడుగులు ముందుకు లంకించేంత శక్తి ఉంటుందని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, ఫలితాలను విశ్లేషించుకొని పట్టుబట్టి కొట్లాడాలని, గుండె ధైర్యంతో ముందుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేశామే కానీ రాజకీయం చేయలేదని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి ప్రజలను మభ్యపెట్టిందని ధ్వజమెత్తారు.

జనవరి 1న పెన్షన్లను పంపిణీ చేయాల్సింది ఇప్పటి వరకు పెన్షన్ల ఊసే లేదని ఎండగట్టారు. ఒకటి రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, రైతు బంధు నిధుల పంపిణీ ప్రస్తావనే లేదని అన్నారు. ప్రజా పాలనలో భాగంగా కోటి 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారని, ఆ దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు అర్థమవవ్వడం లేదని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 44 లక్షల మందికి కేసీఆర్ హయాంలో పెన్షన్లు అందించిందని, వారికి పెన్షన్ల మొత్తం పెంచి పంపిణీ చేయకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారని లేవనెత్తారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును వినియోగిస్తే కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కాబట్టి ఆ ప్రకారం బిల్లు వస్తే ఎవరూ చెల్లించవద్దని పిలుపునిచ్చారు. అలాగే, అభివృద్ధిలో తాము ఎక్కడా ఆటంకపర్చబోమని, హామీల అమలులో సూచనలు చేస్తామని, అవసరమైతే నిలదీస్తామని, కానీ జరుగుతున్న పనులు మాత్రం నిలిపివేయవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి, ప్రజల హక్కులను సాధించడానికి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ అనే మాట మాట్లాడేది కేవలం బీఆర్ఖ్ఎస్ పార్టీ మాత్రమేనని, కాబట్టి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎప్పుడూ కూడా పార్లమెంటులో తెలంగాణ గురించి మాట్లాడలేదని విమర్శించారు.

2009లో కేసీఆర్ గారు మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తెలిపారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారని గుర్తు చేశారు. పాలమూరు ప్రజల వలసలను అడ్డుకట్ట వేయడానికి కృషి చేశామని తెలిపారు.

Also Read:ఆవాల నూనెతో ప్రయోజనాలు!

- Advertisement -