పంటల మార్పిడి,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ఆధారంగా పంటలు పండించడం వల్ల అధిక లాభాలు వస్తాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.నేడు రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో డ్రాగన్ తోట, తిరుమలాపూర్ గ్రామంలో అంజీర తోటల సాగు విధానాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కలెక్టర్ శశాంక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు పలు సూచనలు చేశారు.రైతులందరూ ఒకే పంటను వేయడం ద్వారా మద్దతు ధర లభించదని అన్నారు.పంటల మార్పిడి పద్ధతి ద్వారా అధిక లాభాలను పొందవచ్చునని.. ముఖ్యమంత్రి కెసిఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ కాళేశ్వరం నీళ్లతో సహకారం అవుతుందని దానికి నిదర్శనమే నేటి ధాన్యం నిల్వలు అని ఎమ్మెల్యే తెలిపారు.
రైతులందరూ ఒకే పంటను వేయకుండా మార్కెట్‌లో ఉన్న డిమాండును బట్టి పంటలను సాగు చేసి లాభం సమకూర్చుకోవాలని సూచించారు. డ్రాగన్,అంజీర తోటలను పెంచుతున్న రైతులను ఎమ్మెల్యే అభినందించారు.మిగిలిన రైతులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇవే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించే బత్తాయి, దానిమ్మ, బొప్పాయి,అరటి, ద్రాక్ష తోటల పెంపకం వైపు కూడా రైతులు మొగ్గుచూపాలని అన్నారు.ఎక్కడి ప్రాంతంలో,ఏ నేలలో, ఏ తోట అనువుగా ఉంటుందో ఆ తోటను పెంచడానికి రైతులు ఆసక్తి చూపాలి. అదిలాబాద్ జిల్లాలో ఆపిల్ పండటం శుభ పరిణామం అన్నారు.ఇది కేవలం శీతల ప్రదేశంలోనే పండేదని కానీ తెలంగాణలో పండటం శుభ పరిణామం అన్నారు.
ప్రభుత్వం నుంచి పూర్తి ప్రోత్సాహం ఉంటుందని..మిశ్రమ పంటలు వేయడం కూడా లాభదాయకం అని అన్నారు.నీళ్ళు అధికంగా ఉన్నాయని రైతులు కేవలం వరి వైపే మొగ్గు చూపవద్దని కోరారు.రైతును రాజుగా చూడాలనేది కెసిఆర్ ఆకాంక్ష. కానీ ప్రతిపక్షాలు మాత్రం రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి వీటన్నిటిని కూడా రైతులు గమనించాలి. రైతులకు వ్యవసాయ అధికారులు తమ వంతు సహకారం అందిస్తారు. చిరు ధాన్యాలైన పప్పు ధాన్యాలు,వాణిజ్య పంటలైన మొక్కజొన్న,పత్తి,వరిలో సన్న రకాలను పండించి లాభాలను పొందవచ్చు. అల్లం, ఉల్లిపాయ,ఆలు గడ్డ,ఎల్లిపాయలు, కూరగాయల పంటల వైపు మొగ్గు చూపాలని ఎమ్మెల్యే వివరించారు.ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,పలువురు అధికారులు పాల్గొన్నారు.