మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై తీవ్రస్ధాయిలో మండపడ్డారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. దళిత వ్యతిరేకి ఈటలకు హుజురాబాద్ ప్రజలు కర్రుకాల్చి వాతపెడతారని విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన దళిత్ ఎంపవర్మెంట్ కింద సీఎం కేసీఆర్ బడ్జెట్లోనే రూ.1000 కోట్లు ప్రకటించారని గుర్తుచేశారు. దళితబంధు నిధులు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డాయని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులిస్తే ఖర్చు చేయలేని దద్దమ్మ ఈటల అని ఎద్దేవా చేశారు.
దళితబంధుపై ఈటల పిచ్చి మాటలు మానుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. హుజూరాబాద్‌కు ఈటెల ఏం చేసిండో చెప్పి ఓట్లడగాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కార్ సబ్సిడీలను ఎత్తివేస్తున్నదని, ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. దళితుల సంక్షేమం కోసం బీజేపీ ఒక్క పథకమైనా తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన ఆ పార్టీని ప్రజలు తరిమికొడతారన్నారు.