సోమవారం నగరి ఎమ్మెల్యే రోజా చెన్నై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన భర్త ఆర్కే సెల్వమణితో కలిసి సీఎం కార్యాలయానికి వెళ్లిన రోజా… స్టాలిన్‌కు కొన్ని ప్రత్యేకమైన శాలువాలను బహూకరించారు. ఆ శాలువాలపై స్టాలిన్ బొమ్మ ముద్రించి ఉండడం విశేషం. ఇక, స్టాలిన్‌తో భేటీ సందర్భంగా ఏపీలో నివసిస్తున్న తమిళుల సమస్యలను ఆయనకు వివరించారు. దీనికి సంబంధించి వినతిపత్రం కూడా అందించారు.
ఎమ్మెల్యే రోజా విన్నవించిన వాటిలో ప్రధానంగా…
1.ఆంధ్రప్రదేశ్‌లో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలు (మెట్రిక్యులేషన్ సిలబస్ ) ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక్కొక్క తరగతికు 1000 చొప్పున మంజూరు చేయాలని కోరారు.
2.ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5 వేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న కొసలనగరం పారిశ్రామిక పార్క్ నకు తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి,భారీ వాహనాల ట్రాన్స్పోర్టేషన్ రాకపోకలకు అనువుగా నేడుంబరం – అరక్కోణం రోడ్డు NH 716 నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు కోరారు.మరియు ప్రతిపాదనలు పంపారు.
3.అతి ప్రధానంగా ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాలలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ కార్మికులు ఒక కోటికి పైగా ఉన్నారని కరోనా తర్వాత ప్రపంచ దేశాలు Textiles ను చైనా దేశం నుండి దిగుమతి చేసుకోకపోవడం కారణంగా ప్రపంచం యొక్క Textiles అవసరాలను మన దక్షిణ భారత దేశంలోని చేనేత మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా గతంలో చర్చించామని దీనిపై తగు సూచనలు, చర్యలు తీసుకోవాలని వివరించారు.
4.అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నివాసముంటున్న తమిళ కుటుంబీకులు చెన్నై మహానగరం తోనూ తమిళనాడులోని ప్రధాన పట్టణాల్లోనూ బంధుత్వ పరంగా అయినా, వ్యాపారపరంగా అయినా చాలా ఎక్కువ లావాదేవీలు కలిగి ఉన్నారని, అటువంటి వారికి తమిళనాడులో జనరల్ హాస్పిటల్స్ లో తమిళనాడు ప్రభుత్వ పౌరుడుకు ఉన్న సౌకర్యాలు అన్నింటిని కూడా చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఉన్న తమిళ కుటుంబీకులకు కూడా అదే సౌకర్యాలను వర్తింపజేయాలని విన్నవించారు.
ఈరకమైన ప్రజలకు ఉపయోగపడే ప్రతిపాదనలను ఎప్పటికీ స్వాగతిస్తామని, వీటిని పరిశీలించి తగు చర్యలు తొందరగా తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు, రాయలసీమ వీవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెల్వమణికి హామీ ఇచ్చారు.