రాజకీయ లబ్ధి కోసమే టికెట్ల రేట్లపై ఆరోపణలు: రోజా

26
roja

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని సినీనటులు కోరుతుండగా ప్రజల సంక్షేమం కోసమే ఈవిధంగా రేట్లు పెట్టామని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా ఈ వ్యవహారంపై స్పందించారు.

పేద ప్రజల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్‌ లాంటి స్నేహపూర్వకమైన ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూసి ఉండం. చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ పెద్దలు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పెట్టాలని ఎన్నోసార్లు కోరడం వల్లే జగన్‌ అంగీకరించారు. సినిమా వాళ్లతో చర్చలు జరిపి, వాళ్ల అభ్యర్థన మేరకే ఇప్పటివరకూ ఆయన అన్నీ చేశారు. కానీ, ఇప్పుడు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం దీన్ని సమస్యగా మారుస్తున్నారని నా అభిప్రాయం. ఇది తెలుసుకుని మిగిలిన సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే చర్చలకు వస్తున్నారు. కాబట్టి త్వరలో ఓ మంచి నిర్ణయం వస్తుందని భావిస్తున్నా అని రోజా తెలిపారు.