గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ దసరా పండుగకి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరుకో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో జమ్మి మొక్కను నాటారు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్ల పండగ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సరికొత్త పంథాలో ముందుకు సాగుతుంది. మంచి ఆశయానికి వెయ్యి మార్గాలు తోడు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వృక్షం, దసరాకు పూజించుకునే జమ్మి చెట్టును భాగం చేశారు నిర్వాహకులు. శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! అని అందరి పెదాలపై పూజ వినిపిస్తున్న ఊళ్లలో మాత్రం జమ్మి చెట్టు కనిపించడం కష్టంగా మారింది. అందుకే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో జమ్మిని భాగం చేసిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కృషి ఎనలేనిది అని ఊరికి జమ్మిచెట్టు,గుడి గుడికి జమ్మి చెట్టును నాటే మహాసంకల్ప కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు జమ్మిచెట్టు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. అంతరించిపోతున్న జమ్మిచెట్లను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపదుతుందని కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జమ్మిచెట్టు నాటిన ఎమ్మెల్యే భగత్‌ను ట్విట్టర్ వేదికగా అభినందించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్.