ముఖ్యమంత్రి జగన్ తనపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు నెల్లూర రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు ఉదయం పోలీసులు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజురైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నది తమ అధినేత వైఎస్ జగన్ నమ్మకమని, ఆ నమ్మకమే తనను అరెస్ట్ చేయించిందన్నారు. ఆధారాలుంటే, తమ పార్టీ నాయకుడైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారని, అటువంటి వ్యక్తి కలకాలం పాటు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఈ కేసు విషయంలో తనది ఏమైనా తప్పు ఉంటే ఎంపీడీవో సరళకు ఆమె తల్లికి క్షమాపణలు చెబుతానని చెప్పారు.