తగ్గేదేలే అంటున్న జగ్గారెడ్డి..?

57
- Advertisement -

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని సంక్షోభంలోకి నెట్టేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో విబేధాల నేపథ్యంలో తనను కేసీఆర్ కోవర్ట్ అంటూ రేవంత్ ఫ్యాన్స్ చేస్తున్న దుష్ప్రచారంతో తీవ్ర మనస్తాపం చెందిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్ తదితరులు బుజ్జగించడంతో తన రాజీనామాపై 15 రోజులు గడువు ఇచ్చిన జగ్గారెడ్డి తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే సోనియాగాంధీ, రాహుల్‌‌గాంధీలకు తన ఆవేదన చెప్పుకుంటానని అన్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి సముదాయించడానికి కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వయంగా జగ్గారెడ్డి ఫోన్ చేసి సీఎల్పీ కార్యాలయానికి రావాలని పిలిచారు. దీంతో జగ్గారెడ్డి అక్కడకు వెళ్లారు. సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డితో భట్టి విక్రమార్కతో పాటు, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ ససందర్భంగా రాజీనామా వెనక్కి తీసుకోవాలని జగ్గారెడ్డిని బుజ్జగించారు. రాజీనామా అంశాన్ని పక్కనపెట్టాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని భట్టి జగ్గారెడ్డికి నచ్చచెప్పారు. అలాగే జగ్గారెడ్డికి ఏఐసీసీ పెద్దల నుంచి కూడా కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఢిల్లీకి పిలుస్తామని, అన్ని విషయాలు మాట్లాడుకుందామని, పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయరాదంటూ ఏఐసీసీ నేత జగ్గారెడ్డికి సూచించినట్లు సమాచారం.

అయితే తన రాజీనామాకు బ్రేక్‌ మాత్రమే వేశా.. తప్పితే వెనక్కి తగ్గలేదని జగ్గారెడ్డి ప్రకటించారు. కార్యకర్తలు అడిగే అన్నింటికీ సమాధానం చెప్పలేనన్న ఆయన.. నేను ఏం చెప్పాలని అనుకున్నానో అదే చెప్పా అన్నారు.. ఇక తాను టీఆర్ఎస్ ట్రాప్‌లో పడ్డానన్న రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. పీసీసీ చీఫ్‌‌కు ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటూ మరోసారి విరుచుకుపడ్డారు… నేను ఎవరి ట్రాప్‌లో పడను.. పడలేదని అని తేల్చి చెప్పిన జగ్గారెడ్డి ఎవరైనా నా ట్రాప్‌లోకి రావాల్సిందే అన్నారు.. అసలు సోషల్ మీడియాలో నేను టీఆర్ఎస్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం ఎవరు చేస్తున్నారో నాకు తెలియదా..? అని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.. మొత్తంగా సీఎల్పీ నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్‌బాబులు బుజ్జగించినా జగ్గారెడ్డి రాజీనామాపై వెనక్కి తగ్గకపోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -