బహుభాషాకోవిదుడు…ఎమ్మెల్యే హన్మత్ షిండే..!

130
shinde
- Advertisement -

మామూలుగా మన తెలంగాణలో రాజకీయ నాయకులు ఎన్ని భాషలు మాట్లాడుతారు…మహా అంటే తెలుగు, హిందీ, కాస్త ఎడ్యుకేటెడ్ అయితే ఇంగ్లీష్‌ మాట్లాడుతారు..మరి మన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలుగు తప్పా..ఇంకే భాష సరిగా రాదంట.. పార్లమెంట్‌లో హిందీలో ప్రసంగించడానికి బండి పడే పాట్లు చూస్తే కడుపుబ్బా నవ్వుకోవచ్చని కాషాయ పార్టీలోనే సెటైర్లు పడుతుంటాయి. అది పక్కనపడితే.. ఆరు భాషల్లో అదరగొడుతున్న ఎమ్మెల్యే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఇంతకీ బహుభాషాకోవిదుడైన ఆ ఎమ్మెల్యే ఎవరునుకుంటున్నారా..ఆయనే మన జుక్కల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జుక్కల్‌ నియోజకవర్గంలో ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడతారు.

మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. అక్కడ చాలా వరకు మరాఠీ మాట్లాడుతారు. పలు గ్రామాల్లో మరాఠీ మీడియం స్కూళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జుక్కల్‌ మండలంలోని సోపూర్‌ గ్రామం దాటితే కర్ణాటక రాష్ట్రం వస్తుంది. దీంతో జుక్కల్‌ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చాలా వరకు కన్నడనే మాట్లాడతారు. ఇలా జుక్కల్‌ నియోజకవర్గం మూడు భాషల సంగమంలా ఉంటుంది. అయితే ఇక్కడ వరుసగా మూడుసార్లు గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఏకంగా ఆరుభాషల్లో అనర్గళంగా మాట్లాడుతారు. ఇంజనీరింగ్‌ చదివిన హన్మంత్‌ షిండేకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషలతో పాటు కన్నడ, మరాఠీ, లంబాడీ భాషలు కూడా వచ్చు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఏ భాష మాట్లాడితే ఎమ్మెల్యే కూడా వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడతారు.

ఎమ్మెల్యే షిండే ఎన్నికల సమయంలో ప్రచారంతో పాటు, గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడుతారు. ప్రతి సభలో ఆయన మూడు భాషలలో మాట్లాడి ఆకట్టుకుంటారు. దీంతో ప్రజలు కూడా ఆయనంటే అభిమానం చూపిస్తారు. జుక్కల్‌ మండలంలోని సోపూర్‌ పరిసర గ్రామాల ప్రజలు చాలా వరకు కన్నడనే మాట్లాడతారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆ గ్రామాలకు వెళ్లినప్పుడు ‘నీవు హేగిద్దిరే’ అంటూ కన్నడలో మాట్లాడి అక్కడి ప్రజల కష్టసుఖాలను కనుక్కుంటారు. ఇక మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని మరాఠీ మాట్లాడే గ్రామాలకు షిండే వెళ్లినప్పుడు… కనిపించిన వారినల్లా ‘కసే అహత్‌’ అంటూ మరాఠీలో వారి యోగ క్షేమాలు తెలుసుకుంటారు.

అలాగే తెలుగు మాట్లాడే గ్రామాలకు వెళితే ‘బాగున్నరా..’ అంటూ తెలుగులో మాట్లాడతారు. జుక్కల్ నియోజకవర్గంలో గిరిజనుల జనాభా కూడా ఎక్కువే. మన ఎమ్మెల్యే సారు లంబాడీ భాషలో కూడా అనర్గళంగా మాట్లాడతారు. అలాగే అధికారుల దగ్గరకు వెళ్లినపుడు ఇంగ్లీషు భాషలో వాయించేస్తారు. హిందీ మాట్లాడే అవకాశం ఉంటే హిందీలో మాట్లాడతారు. ఇలా మన జుక్కల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆరుభాషల్లో అదరగొట్టేస్తూ ప్రజలను, అధికారులను ఆశ్చర్యపరుస్తుంటారు..గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆయనలా కాకపోయినా మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆరు భాషల్లో మాట్లాడే ప్రావీణ్యం సంపాదించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతం తన నియోజకవర్గంలో ఆరుభాషల్లో మాట్లాడుతూ ప్రజలతో మమేకమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలంగాణ రాజకీయాల్లో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచారు. హ్యాట్సాఫ్ షిండే సార్..!

- Advertisement -