ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్..

16

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ గణగాని మాధవి అధ్యక్షతన నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరైయ్యారు. ఈసందర్భంగా ఆమెకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తొలుత సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా స్థానిక మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమవేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి వాటిలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఏ విధంగా సరి చేసుకోవాలనే సదుద్దేశంతో ఊరూరా రైతు బంధు వారోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగిందని, గత పాలకుల చేతిలో అరిగోసలు పడ్డ అన్నదాతల దుస్థితిని చూసిన రైతు పక్షపాతి కెసిఆర్ పెట్టుబడి సాయం కింద రైతుకు ఎకరానికి 5 వేల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, భూ గర్భ జలాల పెంపుకు మిషన్ కాకతీయ, లక్ష రూపాయల రుణమాఫీ లాంటి మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయమే దండుగ అన్న వారి నోట వ్యసాయం పండుగ అని పలికించి దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంటికి రెప్పలా కాపాడే లక్ష్యంగా పని చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసి అవసరం ఉన్న ప్రాంతాల్లో పంపిణీ చేయాల్సిన కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్రాన్ని అభాసుపాలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు బంధు, రైతు భీమా, మిషన్ కాకతీయ,24 గం.ల ఉచిత కరెంట్ లాంటి పథకాలు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లు ప్రతిపక్షాలు పాలిస్తున్న ఏ రాష్ట్రాల్లో చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముగింపు కార్యక్రమంలో రైతు బంధు వారోత్సవాల ముగ్గుల పోటీల మహిళా విజేతలకు బహుమతులు అందజేశారు అనంతరం పలువురు రైతులను సన్మానించారు.