కొంత మంది కొత్తగా పుట్టుకొచ్చారాని పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు తమిళనాడు సీఎం డీఎంకే నేత ఎంకే స్టాలిన్. ఎన్నికల్లో ఉచిత హామీలను ప్రకటించడాన్ని తప్పుపట్టిన స్టాలిన్ విద్య ఆరోగ్యం రంగాలపై హెచ్చించే ఖర్చు ఉచితాలు కావని వ్యాఖ్యానించారు. చెన్నైలోని కొలత్తూరు అరుల్మిగు కపాలీశ్వర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ.. విద్య, వైద్యాన్ని ఉచితాల కింద పరిగణించకూడదన్నారు. విద్య, ఆరోగ్యంపై చేసే ఖర్చు ఉచితాలు కాదని తెలిపారు. విద్య అనేది జ్ఞానానికి సంబంధించినదని, వైద్యం ఆరోగ్యానికి సంబంధించినదని గుర్తు చేశారు. కాగా, పేదలకు మేలు చేసేందుకే ఆరోగ్యం, విద్యపై ఖర్చు చేస్తున్నామని స్టాలిన్ తెలిపారు. ఈ రెండు రంగాల్లో తగినన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. ఉచితాలు ఉండకూడదనే సలహాతో కొంతమంది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చారు అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తాను ఎక్కువగా మాట్లాడితే అది రాజకీయం అవుతుందని, కాబట్టి దీనిపై ఎక్కువగా మాట్లాడనని అన్నారు.