రివ్యూ : మిస్టర్‌

354
Mister Review
- Advertisement -

బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య‌త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మిస్టర్‌. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న ఈ మూవీ శ్రీనువైట్లకి బ్రేక్ ఇచ్చిందా…?మిస్టర్‌తో వరుణ్‌ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

Mister Review

కథ:

ఆంధ్రా కర్ణాటక సరిహద్దులోని ఓ గ్రామంలో పిచ్చయ్యనాయుడు(నాజర్‌) గుండప్ప నాయుడికి ఏళ్లుగా పగ ప్రతీకారాలుంటాయి. ఈ గొడవలకు దూరంగా తన కుటుంబసభ్యలను విదేశాల్లో ఉంచుతాడు. కట్ చేస్తే విదేశాల్లో ఉండే పిచ్చయ్య మనవడు ‘చై’ (వరుణ్ తేజ్‌) తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.  ధనవంతుల బిడ్డ అయినప్పటికీ.. అతడిది అందరికీ సహాయపడే మనస్తత్వం. మీరా (హెబ్బా పటేల్‌) అనే యువతి ఇండియా నుంచి ‘చై’ ఉన్న ప్రదేశానికి వస్తుంది. ఆమెను తొలిచూపులోనే అతడు ప్రేమించేస్తాడు. తన లవ్ ప్రపోజ్ చేద్దామనుకుంటున్న సమయంలో మీరా ఇండియాలో జరిగిన తన లవ్ స్టోరీని ‘చై’కి చెబుతుంది.  మీరాకు హెల్ప్ చేసేందుకు ఇండియా వచ్చిన చై తొలిచూపులోనే చంద్రముఖి(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో తన తాతయ్యకు సంబంధించిన ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ కూడా ‘చై’ కి తెలుస్తుంది. దీంతో అప్పటివరకు జరుగుతున్న గొడవలకు చై ఎలా పుల్ స్టాప్ పెట్టాడు..?   మీరా ‘చై’ ను పెళ్లి చేసుకుంటుందా లేక తన ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటుందా? చంద్రముఖి సంగతేంటి.. అన్నదే మిగతా కథ!

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఫస్టాఫ్, పాటలు,కెమెరా వర్క్. వరుణ్ తేజ్ గత సినిమాల కంటే ఇందులో అందంగా కనిపించాడు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎమోషన్స్‌ అద్భుతంగా పండించాడు. హీరోయిన్లు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.ఆనంద్,హరీశ్ ఉత్తమన్,చంద్రమోహన్ పర్వాలేదనిపించారు. ఫస్టాఫ్‌లో వచ్చే రఘుబాబు ఊపిరి స్పూఫ్‌, డైరెక్టర్‌గా థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసే కామెడీ బాగా పేలాయి. పాటలు,నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఇలాంటి కథతో తెలుగులో సినిమాలు చాలానే వచ్చాయి. ఒకే కథలో అనేక ఉపకథలు చెప్పేందుకు శ్రీను వైట్ల చేసిన ప్రయత్నం ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది. ఈ కారణంగానే, సెకండాఫ్ స్క్రీన్‌ప్లే మొత్తం చాలా కన్‌ఫ్యూజింగ్‌గా సాగుతుంది. ఒక కథలో అనేక సబ్‌-స్టోరీలు చెప్పేసి సినిమా ను నడిపిద్దామనుకున్న శ్రీనువైట్ల ప్రయత్నం ఏమాత్రం సక్సెస్ కాలేదు. హీరో,హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ను సరిగ్గా డెవలప్ చేయకపోవడం మరో మైనస్ . తన రెగ్యులర్ సినిమాల్లోని బకరా కామెడీనే ఇక్కడా వాడాడు.

Mister Review

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫారిన్ లోకేషన్లతో పాటు పల్లెటూరి అందాలను కేవి గుహన్ సినిమాటోగ్రఫీలో చూడొచ్చు. శ్రీధర్ సీపాన అందించిన డైలాగులు కితకితలు పెట్టిస్తాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు.

తీర్పు:

 ఆగడు,బ్రూస్‌ లీ ప్లాప్‌ల తర్వాత తనమార్క్ సినిమాతో వండర్ చేస్తాడనుకున్నశ్రీను వైట్  ప్రేక్షకులకు కాస్త నిరాశపర్చాడనే చెప్పాలి. పాత కథకే తన మార్క్ కామెడీని జోడించి సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్, పాటలు, కామెడీ సినిమాకు ప్లస్ కాగా బోరింగ్ సెకండాఫ్,హీరో,హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ మైనస్ పాయింట్స్. మొత్తంగా మిస్టర్‌తో శ్రీను వైట్ల పర్వాలేదనిపించాడు.

విడుదల తేదీ:14/04/2017
రేటింగ్: 2.75 /5
నటీనటులు :వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి,హెబ్బా పటేల్
సంగీతం:మిక్కీ జే మేయర్
నిర్మాత:నల్లమలుపు బుజ్జి,ఠాగూర్ మధు
దర్శకుడు:శ్రీను వైట్ల

- Advertisement -