‘మిస్టర్ మిడిల్ క్లాస్’..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

1
- Advertisement -

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ముందుగా పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఇది ఆయన సినిమానే. వెంకటేశ్వర స్వామి పాత్ర లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. అలాంటి గొప్ప పాత్ర ఆయనకు రావడం అదృష్టం. ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. మనమందరం కూడా ఏదో ఒక సమయంలో మిడిల్ క్లాస్ నుంచే వచ్చిన వాళ్లమే. ఈరోజు ధనవంతులుగా ఉన్న వాళ్లూ ఒకప్పుడు మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపారు. మిడిల్ క్లాస్ వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చెప్పడం ఒక గొప్ప కళ. ఆ విషయంలో నాగేశ్వర్ రెడ్డి గారు అద్భుతంగా విజయం సాధించారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడికే చెప్పుకుంటాం. ఇలాంటి ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌లో నటించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గారికి, నిర్మాత చందు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ చేసి చాలా కాలమైంది. ఇందులో ఉన్న ప్రతి ఆర్టిస్ట్‌తో గతంలో నేను కలిసి పనిచేశాను. మళ్లీ వాళ్లందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పాత రోజులు గుర్తుకు తెచ్చింది. రఘుబాబు, సునీల్, వెన్నెల కిషోర్… ఇలా ఎంతో మంది అద్భుతమైన నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు. ప్రతి పాత్ర కథకు బలంగా నిలుస్తుంది. ఒక్కో పాత్ర చాలా బాగా ఎలివేట్ అయింది. రత్నబాబు రాసిన డైలాగులు చాలా సరదాగా, సహజంగా ఉంటాయి. అంజి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. లయ గారు కూడా ఈ సినిమాకు చాలా పెద్ద బలం. ‘స్వరాభిషేకం’ తర్వాత మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. మా జోడీ ఈ కథకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌లు కొంచెం తగ్గాయి. మంచి వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం మాకు ఉంది. అనిల్ రావిపూడి వరుసగా వినోదాత్మక చిత్రాలు చేసి ఈ జానర్ కి ఎంత ఆదరణ వుందో చూపించారు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ కూడా మంచి వినోదాత్మక సినిమానే. జూలై 17న మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా థియేటర్లలో చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గారు ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాకి ఫస్ట్ క్లాప్ కొట్టారు. అప్పటి నుంచి మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఈ స్థాయికి వచ్చారు. ఆయన ఎదుగుదల చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర చేయాలని నాగేశ్వర్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను చాలా ఆలోచించాను. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు పోషించిన పాత్రలన్నీ నాకు గుర్తుకొచ్చాయి. అలాంటి పాత్రలు చేయాలంటే చాలా భయం, భక్తి ఉండాలి. అందుకే ఈ పాత్రను ఎంతో నిష్ఠతో చేశాను. మేకప్ వేసుకున్న తర్వాత కూర్చోవడానికి కూడా మనసు రాలేదు. ఎక్కువసేపు నిల్చునే ఉండేవాడిని. సెట్లో అందరూ ‘చాలా అద్భుతంగా ఉంది’ అని చెప్పిన ప్రతిసారీ నాకు ఎంతో ప్రోత్సాహంగా అనిపించేది. ఇలాంటి గొప్ప పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ పాత్ర ఇచ్చిన నాగేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాకు సాయి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నా ఇంట్రడక్షన్ సీన్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ పూర్తిగా ప్రేక్షకుల కోసం తీసిన సినిమా. ఈ రోజుల్లో మనం మిడిల్ క్లాస్ వాళ్లమంతా ఎలాంటి సమస్య వచ్చినా వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తాం. మన బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటాం. ఈ సినిమాలో కూడా వెంకటేశ్వర స్వామిని చాలా ఫ్రెండ్లీగా చూపించాం. ఆ పాత్ర ద్వారా రాజేంద్ర ప్రసాద్ మీ అందరికీ ఒక స్నేహితుడిలా అనిపిస్తాడు. ప్రేక్షకులందరూ ఈ పాత్రను ఎంతో ఎంజాయ్ చేస్తారని నేను గ్యారెంటీగా చెబుతున్నాను. శ్రీకాంత్‌తో నేను ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమా నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాను. మా కాంబినేషన్ ఎప్పుడూ ప్రేక్షకులను అలరించింది. చాలా కాలం తర్వాత మళ్లీ శ్రీకాంత్‌తో కలిసి ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. జూలై 17న విడుదలవుతున్న ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమాను అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మా సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పిన వి.వి. వినాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో మరో మాటే లేదు. శ్రీకాంత్ గారితో సినిమా చేయడం నాకు ఎప్పుడూ హాయిగా ఉంటుంది. ఈ సినిమాను కూడా ఎంతో ప్రశాంతంగా పూర్తి చేశాం. పెళ్లి సందడి, వినోదం, ఎగిరే పావురమా, ఆమే వంటి శ్రీకాంత్ గారి బ్లాక్‌బస్టర్ సినిమాలను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు రావాలి. శ్రీకాంత్ గారు మరో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నారు. వెయ్యి శాతం గ్యారెంటీగా చెబుతున్నాను. శ్రీకాంత్ గారి కోసమైనా ఈ సినిమాను చూడాలి. రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపిస్తారు. ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ సినిమాకు ఆయన వెన్నెముకలా నిలిచారు. కుటుంబంలో ఉన్న ప్రతి భార్య లయ గారి పాత్రను ఎంతో ఇష్టపడుతుంది. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. మా డీవోపీ అంజి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి నాకు అండగా నిలిచారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా ఆయన రీ-రికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసింది. వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో మాషప్ చేసి రూపొందించిన ఒక ప్రత్యేకమైన పాట ఉంది. అది విన్న తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. మా నిర్మాత చందు గారు చాలా ప్రశాంత స్వభావం ఉన్న వ్యక్తి. ఆయనకు ఎప్పుడూ కోపం రావడం నేను చూడలేదు. అలాగే జీకే గారు కూడా ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా ద్వారా నిర్మాతలు తప్పకుండా సూపర్ హిట్ అందుకుంటారు. జూలై 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ఘన విజయం సాధిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను.”

వి.వి. వినాయక్ మాట్లాడుతూ… నాగేశ్వర్ రెడ్డి గారు తెరకెక్కించిన 16 సినిమా పాటలు మా నాన్నగారికి ఎంతో ఇష్టం. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంది. ట్రైలర్ చూడగానే ఇది సూపర్ హిట్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. శ్రీకాంత్ అప్పుడెలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వెంకటేశ్వర స్వామి గెటప్ కన్నుల పండుగలా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరు, మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

కోన వెంకట్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నాగేశ్వర్ రెడ్డి గారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అనే టైటిల్‌లోనే చాలా పాజిటివ్ వైబ్ ఉంది. సినిమాకు అసలైన బలం మిడిల్ క్లాస్ ప్రేక్షకులే. వాళ్ల వల్లే సినిమాలు విజయాలు సాధిస్తుంటాయి. నాగేశ్వర్ రెడ్డి గారి కామెడీ సీన్లు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి. జూలై 17న ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ మిడిల్ క్లాస్ మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను.”

దశరథ్ మాట్లాడుతూ… నేను ఇండస్ట్రీలో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది శ్రీకాంత్ గారి సినిమాకే. అప్పట్లో ఆయన ఎంత అందంగా, సింపుల్‌గా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. నాగేశ్వర్ రెడ్డి గారు సెల్ఫ్‌మేడ్ వ్యక్తి. నాగేశ్వర్ రెడ్డి గారు తెరకెక్కించిన 16 ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ కథ, సంగీతం రెండూ చాలా బాగా ఉన్నాయి. ఈ సినిమా కూడా మరో బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నిర్మాత చందు మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. జీకే గారు ఒక మంచి సినిమా తీద్దామని చెప్పారు. అలా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి కుటుంబం మొత్తం చూసే మంచి ఎంటర్‌టైనర్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆయన అద్భుతమైన కథతో మా ముందుకు వచ్చారు. శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, లయ గారు… ఇలా మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ మాకు ఎంతో సహకరించారు. వాళ్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జూలై 17న ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా థియేటర్లలో సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.

అలీ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. శ్రీకాంత్ గారితో నాకు ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర రావడం మామూలు విషయం కాదు. అలాంటి గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం రాజేంద్ర ప్రసాద్ గారి అదృష్టం అని నేను భావిస్తున్నాను. నాగేశ్వర్ రెడ్డి గారితో దాదాపు ఆరు, ఏడు సినిమాల్లో కలిసి పనిచేశాను. ఆయనతో పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. శ్రీకాంత్ గారు, లయ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు… అందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ తప్పకుండా ప్రేక్షకులను అలరించి, పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

డీవోపీ అంజి మాట్లాడుతూ… టీజర్, ట్రైలర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. టీజర్ చూసిన వెంటనే సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిని వెంకటేశ్వర స్వామి పాత్రలో చూస్తున్నప్పుడు నిజంగానే దైవభావన కలుగుతుంది. ఆ పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయారు. శ్రీకాంత్ గారు కూడా ఎప్పటిలాగే తన పాత్రలో ఎంతో సహజంగా నటించారు. శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హిలేరియస్‌గా, అదే సమయంలో ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. మేమంతా ఎంతో ప్రేమతో, కష్టపడి చేసిన సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని, జూలై 17న థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ… ఇది చాలా వెరైటీ సబ్జెక్ట్. అందుకే సంగీతాన్ని కూడా కొత్తగా అందించే ప్రయత్నం చేశాం. ఒక భక్తుడి కోసం వెంకటేశ్వర స్వామి భూమిపైకి రావడం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్. ఆ ఎపిసోడ్‌కు చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా మొదటి నుంచి చివరి వరకు పూర్తి స్థాయిలో అలరిస్తుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, లయ గారు… అందరూ అద్భుతంగా నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.

- Advertisement -