ఏపీలో మరో నెల లేదా రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు కూడా గట్టిగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ.. మరోమారు అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అటు టీడీపీ జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వం స్థాపించాలని పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఈసారి ఏపీ ప్రజలు ఎవరికి అధికారాన్నిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రేస్ లో ఉన్న మూడు పార్టీలను నిశితంగా పరిశీలిస్తే సానుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలకు గత ఐదేళ్లలో సుపరిపాలన అందించామని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని వైసీపీ చెబుతున్నప్పటికి.. ఆ పార్టీకి కొన్ని మైనస్ లు వెంటాడుతున్నాయి..
ముఖ్యంగా గత ఎన్నికల ముందు సంచలనం రేపిన వివేకా మర్డర్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉండడం జగన్ కు అతిపెద్ద మైనస్ అని చెబుతున్నారు విశ్లేషకులు. ఇంకా రాజధాని ఏర్పాటు చేయలేక పోవడం, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోవడం, సంపూర్ణ మద్యపాన నిషేదం చేయలేకపోవడం. జాబ్ క్యాలెండర్ విడుదలలో జాప్యం.. సిపిఎస్ రద్దు చేయలేకపోవడం.. ఇలా చాలా అంశాలే వైసీపీకి ప్రతికూలంగా మారనున్నాయనేది కొందరి అభిప్రాయం. ఇక టీడీపీ విషయానికొస్తే.. 2014లో అధికారం చేపట్టిన ఆ పార్టీ ప్రజలు గుర్తుంచుకునేలా పాలన సాగించలేదనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది.
అందుకే మార్పు కోరుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో వైసీపీకి అధికారాన్నిచ్చారు. ఇక ఈసారి టీడీపీకి ప్రజా మద్దతు ఎంతమేర లభిస్తుందనేది ప్రశ్నార్థకమే. ఇక జనసేన విషయానికొస్తే ఆ పార్టీపై ఎలాంటి అవినీతి మరక లేనప్పటికి స్థిరత్వం లేని ఐడియాలజీ జనసేనకు అతిపెద్ద మైనస్ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. పార్టీ స్థాపించి పదేళ్ళయిన ఇంతవరకు ప్రజా మద్దతును కూడగట్టుకోవడంలో పవన్ విఫలం అయ్యారు. పైగా ఈసారి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళడం ఆ పార్టీకి మైనసే అనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఏపీలో ఎన్నికల రేస్ లో ఉన్న మూడు ప్రధాన పార్టీలలోనూ ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుదో చూడాలి.
Also Read:ఐదో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే !