స‌ర్వాయి పాప‌న్న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మంత్రులు..

625
Minister Srinivas Goud
- Advertisement -

స‌ర్వాయి పాప‌న్న తెలంగాణ వీరుడు, తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌరం. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది స‌ర్దార్ సర్వాయి పాపన్న. పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌. గౌడ కులానికే కాదు మొత్తం తెలంగాణ‌కే గ‌ర్వ‌కార‌ణం. అతి సామాన్యమైన జీవితం నుంచి…అత్యంత ఉన్న‌త స్థాయికి ఎదిగిన వ్య‌క్తి. ఓ క‌ల్లుగీత కార్మికుడు…సైన్యాన్ని స‌మ‌కూర్చుకుని, రాజుల‌నెదిరించి, యుద్ధాలు చేసి, రాజ్యాల‌ను స్థాపించి, ప‌రిపాలించ‌డం చ‌రిత్ర‌లో ఓ అరుదైన విష‌యం. అని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిష‌న్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, క్రీడాశాఖ‌ల మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జ‌న‌గామ జిల్లా, కొడ‌కండ్ల మండ‌లం రామ‌వ‌రంలో స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న విగ్ర‌హాన్ని మంత్రులు శుక్ర‌వారం ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్, ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, నాటి స‌ర్వాయి పాప‌న్న యాదృచ్చికంగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న నుంచి సొంత సైన్యాన్ని స‌మ‌కూర్చుకుని నాటి రాజుల సైన్యాన్ని ఎదురించి, మొఘ‌లాయిల‌ను ఎదురించిన మొట్ట‌మొద‌టి తెలంగాణ రాజు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న అని మంత్రులు అన్నారు. ఆ త‌ర్వాత 33 రాజ్యాల‌ను స్థాపించాడ‌న్నారు. జీవించిన‌న్ని రోజులూ రాజుగానే జీవించాడ‌న్నారు. అలాంటి అద్భుత వ్య‌క్తి మ‌న తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ ఆద‌ర్శ ప్రాయుడ‌ని మంత్రులు కొనియాడారు. నాటి స‌ర్వాయి పాప‌న్న రాజ భ‌వ‌నాల‌ను కాపాడే ప‌నిని తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న‌ద‌న్నారు. వాటి సంర‌క్ష‌ణ‌కు ఇప్ప‌టికే చ‌ర్య‌లు ప్రారంభించామ‌న్నారు.

సిఎం కెసిఆర్ కూడా స‌ర్వాయి పాప‌న్న స్ఫూర్తిగా, బ‌డుగుల ఆశాజ్యోతిగా, అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నార‌న్నారు. బ‌డుగుల విద్యా వ్యాప్తికి గురుకులాల‌ను ప్రారంభించార‌న్నారు. బ‌డుగుల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌గా హైద‌రాబాద్‌లో అన్ని కుల సామాజిక వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక భ‌వ‌నాల‌ను నిర్మిస్తున్నార‌న్నారు. కులాల, కుల వృత్తుల అభివృద్ధికి అనేక చ‌ర్య‌లు చేపట్టార‌న్నారు. గొర్లు, బ‌ర్రెలు, చేప‌లు ఇలా అనేక అంశాల‌ను ప్ర‌భుత్వ‌మే చేప‌ట్టింద‌ని గుర్తు చేశారు. స్థానిక సంస్థ‌ల్లో బ‌డుగుల‌కు, స్త్రీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త కూడా సీఎం కెసిఆర్ దేన‌ని మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు వివ‌రించారు. బ‌డుగుల ఆశాజ్యోతి అయిన సీఎం కెసిఆర్ చేప‌ట్టిన ప‌థ‌కాలకు దేశ వ్యాప్తంగా గౌర‌వం, అవార్డులు, రివార్డులు ద‌క్కుతున్నాయ‌న్నారు. అలాగే క‌ల్లుగీత వృత్తిని సైతం గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానంలో నిలిపిన ఘ‌త‌న సీఎం కెసిఆర్ దేన‌ని మంత్రులు ఎర్ర‌బెల్లి, శ్రీ‌నివాస్ గౌడ్ లు చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురికి క‌ళ్యాణ ల‌క్ష్మీ చెక్కుల‌ను, సిఎంఆర్ ఎఫ్ చెక్కుల‌ని అంద‌చేశారు. అలాగే విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న క‌మిటీని మంత్రులు స‌త్క‌రించ‌గా, అందుకు ప్ర‌తిగా మంత్రుల‌ని క‌మిటీ స‌భ్యులు స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, వివిధ గౌడ సంఘాల ప్ర‌తినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -