మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వం- మంత్రి

97
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో చేసుకోవడం ఆనవాయితీ కాగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణలో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరుతో చేసుకోవడం మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి, భద్రత , పోషణ కార్యక్రమాలకు గానూ వారికి ఈ రాష్ట్ర మహిళలు ఇస్తున్న ఒక కానుక అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

ఈనెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో 6, 7, 8 తేదీల్లో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి, గత వారం రోజులుగా హాస్పిటల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్స్ అందించి, మహిళల కోసం ముఖ్యంగా బాలింతలు, గర్భిణుల కోసం ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారికి వివరించారు. బాలింతలకు కేసీఆర్ కిట్స్ ఇచ్చి, అందులో ఉన్న వస్తువుల గురించి తెలియజెప్పారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగారు.

ఈ సందర్భంగా మీడియా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ ను జిల్లా హాస్పిటల్ గా అభివృద్ధి చేసుకున్నాం. గత వారం రోజులుగా ఈ ఆస్పటల్లో ప్రసవించిన మహిళలకు కు మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేసీఆర్ కిట్స్ అందించడం సంతోషంగా ఉంది అన్నారు. కేసీఆర్ కిట్స్ అంటే కేవలం 16 వస్తువుల పెట్టె కాదని, మహిళలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అన్నారు. దీంతోపాటు ఆరు నెలల గర్భవతి నుంచి మూడు నెలల బాలింత వరకు ప్రతి నెల రెండు వేల రూపాయలను ఆర్థిక సాయం చేస్తూ… ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తున్న గొప్ప పథకం ఇది. పేదింటి మహిళ గర్భం దాల్చినప్పుడు పనికి వెళ్లకుండా ఉంటే కుటుంబం గడవదని, గర్భవతిగా ఉన్నప్పుడు పని చేయకుండా ఉంటూ, మంచి ఆహారం తీసుకోవాలన్న గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డబ్బులు ఇస్తున్నారు.

అదేవిధంగా మహిళ గర్భం దాల్చిన నుంచి ఆమె ప్రసవించి మూడు నెలలు వచ్చేంతవరకు ప్రతి దశలో అంగన్వాడీలు వారి యోగక్షేమాలను చూస్తూ, అవసరమైన వైద్య సలహాలు ఇస్తూ, అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు ఆరోగ్య లక్ష్మి పథకం కింద వేడివేడి భోజనాన్ని అందిస్తూ.. పాలు, గుడ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రసవ తేదీలను ముందే తెలుసుకుని ఆ తేదీల్లో ఆ గర్భిణికి అమ్మ ఒడి పథకం వాహనాన్ని సమకూర్చి, ప్రభుత్వ ఆస్పత్రిలో క్షేమంగా ప్రసవించేలా తోడు ఉండి, ఒక తల్లివలె వారి యోగక్షేమాలను పట్టించుకుంటున్న ప్రభుత్వం ఇది. శిశువుకు ఆరు నెలలు నుంచి ఆరేళ్ల వరకు ప్రతి రోజూ భోజనం, బాలామృతం ఇస్తూ వారికి అండగా అంగన్వాడీలు ఉంటున్నాయన్నారు. ఈ ఆరోగ్య లక్ష్మి పథకం కింద తెలంగాణలో 21 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు అంటే ఇది ఎంత గొప్ప పథకం ఆలోచించాలి. ఈ పథకం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా 450 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.

కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఒక గిరిజన కుటుంబంలో జరిగిన సంఘటన చూసి చలించడం ద్వారా కళ్యాణ లక్ష్మి పథకం రూపుదిద్దుకుంది. మొదట్లో ఈ పథకం కింద 50 వేల రూపాయలు, ఆ తర్వాత 75 వేల రూపాయలు, ఇప్పుడు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చించి 10 లక్షల 32 వేల మందికి లబ్ధి చేకూర్చడం నిజంగా ఒక చరిత్ర. మహిళలకు సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తూనే వారి భద్రతకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందు కోసం షి టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి సెంటర్లు పెట్టి మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోంది.

తెలంగాణ రాకముందు మహబూబాబాద్లో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వరంగల్ కు, హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు మహబూబాబాద్ జిల్లాగా మారి, జిల్లా హాస్పిటల్ రావడం, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ రావడం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ మంజూరు కావడంతో పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు మంత్రి. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక నినాదంతో జరుపుకోవడం ఒక ఆనవాయితీ అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణలో మహిళలంతా మహిళా బంధు పేరుతో జరుపుకుంటూ ఈ మూడు రోజులు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం విశేషం. ఈ సంబరాల్లో భాగంగా మహిళల కోసం, సమాజం కోసం పాటుపడిన అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్ఎంలు సన్మానించుకుంటూ, గౌరవించు కుంటున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జెడ్పి చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, టిఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హాస్పిటల్ సూపర్డెంట్, వైద్యాధికారి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి,ఇతర అధికారులు, సిబ్బంది, పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -