మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష..

325
- Advertisement -

గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై నేడు హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడారం జాతరకు గుర్తింపు పెరిగిందని, గత రెండుసార్లు ముఖ్యమంత్రి కేసిఆర్ మేడారం జాతర పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వసతుల కల్పన చేయడంతో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని మంత్రులు తెలిపారు. గత రెండు సార్లు జాతరలో భక్తులకు కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల అధికారులు ఈసారి ఆ లోపాలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మేడారం జాతర నిర్వహణలో అనుభవజ్ణులైన అధికారులు, సిబ్బంది ఎక్కడున్నా వారిని డిప్యూటేషన్ మీద తీసుకుని, వారి సేవలను వినియోగించుకోవాలని, తద్వారా మేడారం జాతరలో వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లలో గతంలో కొన్ని చిన్ని, చిన్న ఇబ్బందులు వచ్చి కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈసారి అలాంటి వాటికి తావివ్వకుండా వారితో సమావేశాలు నిర్వహించి అందరినీ భాగస్వామ్యంతో జాతర జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ministers

మేడారం జాతర ఏర్పాట్లలో భాగంగా ఆయా డిపార్ట్ మెంట్ల అధికారులు వెంటనే శాఖల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వచ్చే 90 రోజులకు ఆయా శాఖల పరంగా ఏయే పనులు చేయాలనేదానిపై పటిష్ట ప్రణాళిక రూపొందించుకుని సిద్ధంగా ఉండాలని, మరో సమావేశం నాటికి ఇంకా ఏమి కావాలి, ఏం చేయగలమనే దానికిక స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసిఆర్ మేడారం జాతర కోసం 75 కోట్ల రూపాయలను విడుదల చేశారని, వెంటనే ఈ జాతరకు సంబంధించిన 21 డిపార్ట్ మెంట్లు వారి పనులను ప్రారంభించాలని, సంక్రాంతిలోపు పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

అదే సమయంలో పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని కచ్చితంగా చెప్పారు. మేడారం జాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అని, దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు సందర్శించే ఈ జాతరను జాతీయంగా, అంతర్జాతీయంగా బ్రాండింగ్ చేయాలని, జాతర చరిత్ర, విశిష్టతలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేక షోలు వేయాలని సూచించారు. దేశంలోని ముఖ్యమైన విఐపిలను, గిరిజన ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మేడారం జాతర పిల్ల జాతరలకు కూడా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరుతున్న నేపథ్యంలో గతంలో ఈ నిధులు ఎలా కేటాయించారు, ఈసారి వాటికి ఎలాంటి అవకాశం ఉందో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా గొప్ప భక్తులని, జాతరనిర్వహణకు నిధులు లేవని చెప్పే సమస్యల లేదని తెలిపారు. ఇప్పుడు కేటాయించిన 75 కోట్ల రూపాయల నిధులలో ఎక్కువ శాతం డబ్బులు శాశ్వత ప్రాతిపదికన పనులు చేసేందుకు భూసేకరణ కోసమని, మిగిలిన నిధులు తాత్కాలికంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకని అధికారులకు వివరించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కి మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మపట్ల విశ్వాసముందని, నిధులు ఇంకా ఎన్ని కావాలన్నా ఇస్తారని హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు.

medaram

దేశంలోనే అతి ఎక్కువమంది సందర్శించుకునే మేడారం గిరిజన జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అయినా మరోసారి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి దీనిని జాతీయ పండగగా గుర్తించే వరకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత పర్యావరణం కోసం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నేపథ్యంలో జాతరలో వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని, తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దీనికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. త్వరలోనే పూజారుల కమిటీ వేస్తామని, స్థానికులు, ఆదివాసీల అభిప్రాయం మేరకు దీనిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

జాతరలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఉంటుందని, దానిని నివారించాలని, అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, చిల్లర దొంగలు, జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సరిపడా స్నానఘట్టాలు ఏర్పాటు చేయాలని, ఘాట్స్ వద్ద ముగనకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, జాతరకు వెళ్లే దారుల్లో మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని, నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో పనులు చేస్తున్న రోడ్లను త్వరిత గతిన పూర్తి చేయాలని, సెల్ ఫోన్ సిగ్నల్స్ కు ఇబ్బంది లేకుండా టవర్లను పెంచాలని, పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లను మరింతగా పెంచాలని, విఐపీలు వచ్చినప్పుడు సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని సమావేశానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ఇచ్చిన సలహాలను సానుకూలంగా స్వీకరిస్తున్నామని వెంటనే వీటన్నింటిని అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ. నర్సిరెడ్డి, ఎం. శ్రీనివాస్ రెడ్డి,పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీతక్క, చల్లా ధర్మారెడ్డి, ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి, ఐటీడీఏ పి ఓ, పంచాయతీ రాజ్, నీటిసరఫరా, రోడ్డు, రవాణా, వైద్య ఆరోగ్య, దేవాదాయ, పోలీసు వంటి అనుంబంధ 21 శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -